బిజెపి అధికారంలోకి వస్తే కెసిఆర్ అవినీతిపై దర్యాప్తు

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై దర్యాప్తునకు ఆదేశిస్తామని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ ప్రకటించారు. చంద్రశేఖరరావు నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం తదితర అన్ని పథకాలు, ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ అక్రమాలన్నింటిపై దర్యాప్తునకు ఆదేశిస్తామని ఆయన స్పష్టం చేసారు.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 15న హైదరాబాద్‌కు వస్తున్నారని చెబుతూ రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం ప్రారంభం అవుతుందని దత్తాత్రేయ చెప్పారు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని ఆయన తెలిపారు.

తెలంగాణలో జరుగనున్న ముక్కోణపు పోటీలో బీజేపీ బాగా లాభపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనసభ ఎన్నికలకోసం భావసారూప్యత గల పార్టీలు, సామాజిక వర్గాలతో పొత్తు పెట్టుకుంటామని తెలిపారు. ఎవరితో పొత్తు సాధ్యమవుతుంది, ఎవరితో సీట్ల సర్దుబాటు చేసుకోవచ్చు అనేది పరిశీలిస్తున్నామని దత్తాత్రేయ పేర్కొన్నారు.

గత నాలుగేళ్ళల్లో తెలంగాణ అభివృద్దికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నదని చెబుతూ 24 గంటల విద్యుత్, నీటి పారుదల కార్పొరేషన్‌కు కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యుదీకరణ పథకానికి నిధులు వస్తున్నాయని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు, ఇందిరమ్మ వరద పథకం, చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, కాంతానపల్లి, తుపాకులగూడెం నీటి పారుదల పథకాలకు కేంద్రం నుండి రూ.10,160 కోట్లు లభించాయని దత్తాత్రేయ వివరించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకుగాను రూ.892 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.

‘సొమ్మొకడిది సోకడిది’ అన్నట్లు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నిధులిస్తుంటే కెసిఆర్ మాత్రం ఈ పథకాలన్నీ తనవేనంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని దత్తాత్రేయ విమర్శించారు. చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు వెళ్లటం తొందరపాటు, నిరంకుశ చర్య అని ద్వజమెత్తారు. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి అవగాహన లేదని ఆయన స్పష్టం చేసారు. చంద్రశేఖరరావు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయాడని ఆయన విమర్శించారు.

కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను దత్తాత్రేయ ఎద్దేవా చేసారు. ప్రతిపక్షం ‘మోడీ హటావో’ అంటే బీజేపీ ‘దేశ్‌కో బచావో’ అంటున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో తిరుగులేని నాయకుడని అంటూ ఆయనతో ఎవ్వరూ పోటీ పడలేరని దత్తాత్రేయ చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వతంత్రంగా పోటీచేసి ఎప్పుడూ అధికారంలోకి రాలేదని దత్తాత్రేయ చెప్పారు. 1998లో ఘోరంగా ఓడిపోతే 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి మూలంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడని గుర్తు చేశారు. 2006లో బీజేపీ నుండి తప్పుకుని 2014లో నరేంద్ర మోదీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారని దత్తాత్రేయ తెలిపారు. చంద్రబాబు స్వయం ప్రకాశం కాడని, ఇతరుల వెలుతురుతో వెలుగుతాడని అంటూ అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రధాని మోదీని విమర్శించటం సిగ్గుచేటని దయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు మైనారిటీల ఓట్లకోసం బీజేపీని, నరేంద్ర మోదీని విమర్శిస్తున్నాడని ఆరోపించారు.