ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ మృతి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 81ఏండ్ల షీలా దీక్షిత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి 2013 వరకు 15ఏండ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ గవర్నర్‌గా కూడా కొనసాగారు. 

1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తాలలో జన్మించిన దీక్షిత్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేసిన ఆమె ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ చేతిలో 3.66 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. 

తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌ నుంచి లోక్‌సభ(1984- 1989)కు ప్రాతినిధ్యం వహించారు. 1986-1989 మధ్య పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె మొదటి ప్రయత్నంలోనే ఎంపీగా గెలుపొందారు. కేవ‌లం రెండేండ్ల‌లోనే కేంద్ర కేబినెట్‌లో సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

అది కూడా రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, పీఎంవో (ప్రధానమంత్రి కార్యాలయం) సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తదుపరి మూడు ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఆ త‌ర్వాత‌ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కి, 15ఏండ్ల (మూడు ప‌ర్యాయాలు) పాటు పాలించిన మొదటి మహిళా ముఖ్య‌మంత్రిగా రికార్డు నెల‌కొల్పారు.     

షీలా దీక్షిత్ మృతిప‌ట్ల రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు తమ‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, ఓమ‌ర్ అబ్దుల్లా, కాంగ్రెస్ పార్టీ త‌దిత‌రులు సంతాపం తెలిపారు. 

ఢిల్లీ అభివృద్ధిలో షీలా దీక్షిత్‌ విశేష కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. షీలా దీక్షిత్‌ మృతి ఢిల్లీకి తీరని లోటని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఢిల్లీకి సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆమె పేరుపొందారు. 'కాంగ్రెస్ పార్టీ ప్రియమైన నేత షీలా దీక్షిత్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబానికి నా ప్ర‌గాఢ సంతాపం తెలుపుతున్నా' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.