స్విస్‌ఛాలెంజ్‌పై దిక్కు తోచని జగన్ సర్కార్ !

 

రాజధాని నిర్మాణ పనులు నిలిపేయడంతో స్విస్‌ఛాలెంజ్‌ పద్ధతిలో చేసుకున్న ఒప్పందంపై స్పష్టతనివ్వాలని సింగపూర్‌ కాన్సులేట్‌ జనరల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లు అయింది. ఇప్పటికే రెండుసార్లు అధికారులను కలిసిన సింగపూర్‌ ప్రతినిధులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంను కలిశారు. స్విస్‌ ఛాలెంజ్‌ ఒప్పంద వివరాలు, సుర్బానా, జురాంగ్‌ కన్సార్టియం ఇచ్చిన ప్లానింగు అమలు తదితర అంశాలపై చర్చించారు.

ప్రతిపక్షంలో ఉండగా స్విస్‌ఛాలెంజ్‌ పద్దతిని తీవ్రంగా తప్పు పట్టిన జగన్, సింగపూర్ కంపెనీలకు పనులు అప్పచెప్పడాన్ని సహితం పెద్ద కుంభకోణంగా ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయా ఒప్పందాలను కొనసాగించని పక్షంలో మరికొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సింగపూర్‌ ప్రతినిధులు కలవడానికి ముందే సిఆర్‌డిఏ అధికారులను పిలిపించుకున్న సిఎస్‌ సుబ్రహ్మణ్యం దానిపై సమగ్ర సమాచారాన్ని, ఇప్పటి వరకూ జరిగిన పనుల తీరునూ అడిగి తెలుసుకున్నారు.

2015లో మాస్టర్‌ప్లాను ఒప్పందం చేసుకునే సమయంలోనే మాస్టర్‌ డెవలపర్‌ను కూడా తామే సూచిస్తామని, వారికే ప్రాజెక్టు కట్టబెట్టాల్సి ఉందని సింగపూర్‌ ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబిలింగ్‌ యాక్డు-2001ను కూడా అప్పటి ప్రభుత్వం సవరించింది. 2015 మే 22న స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతికి క్యాబినెట్‌ అంగీకరించింది. దీని ప్రకారం ప్రభుత్వం కొంత ఆర్థికంగానూ, వనరుల పరంగానూ సాయం చేయాల్సి ఉంటుంది. అభివృద్ధిదారుకి ప్రత్యేక హక్కులూ ఇవ్వాలి. రూ.5వేల కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది.

దీనికోసం సిఆర్‌డిఏ, సెంబ్‌కార్ప్‌, అసెండాస్‌, సింగ్‌బ్రిడ్జ్‌ కంపెనీలతో కూడిన సింగపూర్‌ కన్సార్టియం 2017 మే 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు చేసుకుంది. ప్రాజెక్టు నిర్వహణ కోసం అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఒప్పందం జరిగి రెండేళ్లు దాటిపోయినా సీడ్‌ డెలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అప్పట్లో సింగపూర్‌ ప్రభుత్వం నేరుగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో ఇప్పుడు దాని అమలు చర్చనీయాంశం అయింది.

ఒప్పందంలో ఉన్న పలు నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టుకున్నాయి. ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం లేకపోవడం, న్యాయపరమైన సమస్యలుంటే లండన్‌ కోర్టులోనే తేల్చుకోవాలనే నిబంధన పెట్టడంతో అది కక్కలేని, మింగలేని విధంగా తయారైంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత నెల రోజులుగా సింగపూర్‌ ప్రతినిధులు స్విస్‌ఛాలెంజ్‌ అంశంపైనే ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజధాని నిర్మాణం తన ప్రాధాన్యత కాదని చెప్పడంతో వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నది. ఒప్పందం ప్రకారం 1,691 ఎకరాల్లో తొలి విడతగా 200 ఎకరాల్లో రోడ్లు, విద్యుత్‌, నీటిసదుపాయం వంటివి కల్పించి అభివృద్ధి చేసి కన్సార్టియంకు అప్పగించాల్సి ఉంది. ఈ అంశంపై ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని సిఎస్‌ను సింగపూర్‌ ప్రతినిధులు కోరినట్లు తెలిసింది. అలాగే తామిచ్చిన ప్లాను అమలు చేస్తారా ? లేదా అనే విషయంపైనా సింగపూర్‌ ప్రతినిధులు చర్చించినట్లు సమాచారం.