గోదావరి-శ్రీశైలం ప్రాజెక్ట్ పట్ల ఏపీ అధికారుల విముఖత?

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపాదించిన గోదావరి-శ్రీశైలం ప్రాజెక్ట్ పట్ల ప్రాధమిక పరిశీలన జరుపుతున్న ఆంధ్ర ప్రదేశ్ ఉన్నతాధికారులు అంతగా సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తున్నది. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ నెల 15 నాటికే రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమై ఒక నివేదిక తయారు చేయవలసి ఉన్నా ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. అందుకు ఇంకా సమయం పెట్టె అవకాశం ఉంది. 

గోదావరి-శ్రీశైలం ప్రాజెక్టును ఎలా ఆచరణలోకి తీసుకురావాలన్న విషయమై తర్జనభర్జనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. తొలి అంచనాల మేరకే డాదాపు లక్షన్నర కోట్లు కావాల్సిన నేపథ్యంలో అంత నిధులను సమకూర్చడం ఎలా అన్న కోణంతోపాటు, భౌతికంగా కలిగే ప్రయోజనాల పైనా అధికార యంత్రాంగం అధ్యయనం కొనసాగుతోంది.

పదవీ విరమణ చేసిన ఇంజినీర్లతోనూ, నైపుణ్యం ఉన్న ఇతరులతోనూ చర్చిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి ప్రాజెక్టు రిపోర్ట్‌ తయారయ్యేసరికి ఇంకా ఆర్ధిక అంచనా పెరుగుతుందని, ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఈ అంచనా రెండు లక్షల కోట్లు దాటిపోతుందని నీటిపారుదల శాఖలోని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

అంటే ఒక్కో రాష్ట్రం దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుందని, ఇది భరించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పట్లో సాధ్యం కాదని ఆర్ధికశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. గోదావరి-శ్రీశైలం అనుసంధానం అనంతరం శ్రీశైలం జలాశయంలోని నీటిపై తెలంగాణ ప్రభుత్వం హక్కులు కోరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న జలవివాదాలనూ అధికారులు ప్రస్తావిస్తున్నారు. 

నాలుగు రోజుల క్రితం జరగాల్సిన ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల కమిటీ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనాటికే ఒక నివేదిక రావాల్సి ఉండగా అది ఆలస్యమైనది. 

సుమారుగా నెలాఖరుకు తుది నివేదిక వచ్చే అవకాశాలున్నాయని, దానిని ఇరు రాష్ట్రాల సిఎస్‌లు, ఇరిగేషన్‌ కార్యదర్శులు చర్చించిన తరువాత ముఖ్యమంత్రుల వద్దకు తీసుకువెళ్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌ దాస్‌ చెప్పారు. మన రాష్ట్రం తరఫున పూర్తి నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సమర్పిస్తామని ఆయన వెల్లదించారు.