నిక్సన్ దారిలో ట్రంప్ రాజీనామా తప్పదా !

అమెరికా చరిత్రలో అప్రతిష్టపాలైన, అభిసంశన ఎదురు కావడంతో అద్యక్ష పదవికి రాజీనామా చేసిన ఏకైక అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మాత్రమె. ఆయన తర్వాత ప్రస్తుత అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహితం అదే బాటలో ప్రయాణం చేస్తున్నారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పదవి చేపట్టిన ఒక సంవత్సరం లోపు నుండే వివాదాల సుడిగండంలో పడుతూ ఉండటం, పలు కేసులలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండటం, ఎదుటివారి పట్ల పుషంగా, పొగరుగా, అహంకారంగా మాట్లాడుతూ అవమాన పరుస్తూ ఉండడంతో సర్వత్రా ప్రతికూలత ఏర్పడుతున్నది.

నిక్సన్‌ను వాటర్ గేట్ కుంభకోణం మింగేసింది. ఈ స్కాం వల్ల నిక్సన్ అమెరికా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో నిక్సన్ అప్రతిష్టపాలయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌కు నిక్సన్ పట్టిన గతే పడుతుందా ? అమెరికాలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. నిక్సన్‌పై వాటర్‌గేట్ కుంభకోణంలో అనేక అభియోగాలు వచ్చాయి. అప్పుడు నిక్సన్ వ్యవహరించిన తీరు, ఇప్పుడు ట్రంప్ ధోరణి ఒకేలా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

ట్రంప్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, అవరోధాలు నిక్సన్ హయాంలో తలెత్తాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కూడా వాటర్‌గేట్ స్పెషల్ ప్రాసిక్యూటర్ విమర్శలను తిప్పిగొట్టేందుకు మొదట అటార్నీ జనరల్‌ను ఆ తర్వాత డిప్యూటీ అటార్నీజనరల్‌ను ఆదేశించాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాని నిక్సన్ ఆదేశాలను పాటించేందుకు నిరాకరించారు. స్పెషల్ ప్రాసిక్యూటర్ ముల్లర్ చేస్తున్న వాదనలను, ట్రంప్‌పై వచ్చిన అభియోగాలను తిప్పిగొట్టేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నిక్సన్ మాదిరిగా ట్రంప్ కూడా అటార్నీ జనరల్, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ను గట్టిగా వాదించాలని ఆదేశించారు.

ఆ రోజుల్లో నిక్సన్ వాటర్ గేట్ స్కాంను వుడ్‌వార్డ్, కార్ల్‌బెర్న్‌స్టెన్‌లు బహిర్గతం చేశారు. వుడ్‌వర్డ్ రాసిన కొత్త పుస్తకం ఫియర్‌లో వైట్ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆసక్తికరమైన విశేషాలను ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు ఏదో విధంగా తనను టార్గెట్ చేయాలనుకుంటున్నారంటూ ట్రంప్ అన్న మాటలు సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఈ రోజు ట్రంప్‌కు చెందిన కీలక నేతలు కూడా ట్రంప్‌ను పిచ్చిప్రేలాపనలు చేస్తున్న వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు.

నిక్సన్ హయంలో కూడా అప్పటి టాప్ లెఫ్టినెంట్ హెన్రీ కిసింజర్ నిక్సన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ కొంత మంది అనుమానస్పద వ్యక్తులపై జస్టిస్ శాఖ విచారణ చేయాలన్నారు. నిక్సన్ కూడా ఫెడరల్ యంత్రాంగంలో రాజకీయ శత్రువుల కదలికలు ఎలా తెలుసుకోవాలో ఉపయోగించుకోవాలన్నారు. ప్రాసిక్యూషన్, లిటిగేషన్‌ను ఉపయోగించుకోవడం, రాజకీయ ప్రత్యర్థుల కాంట్రాక్టులను నిలిపివేయడం తదితర అంశాలపై నిక్సన్ అనుచరులు దృష్టినిసారించడం వివాదస్పదంగా మారింది.

నిక్సన్‌కు విదేయుడుగా ఉన్న లాయర్ డీన్ కూడా చివరకు నిక్సన్‌కు దూరంగా జరిగారు. నిక్సన్ శత్రువుల జాబితాను తయారుచేసి నిక్సన్‌కు సహాయపడిన డీన్ కూడా చివరకు నిక్సన్ చర్యలతో విసుగెత్తిపోయారు. ప్రస్తుతం ట్రంప్ పాలన చూస్తుంటే ఏ క్షణం ఏమవుతుందో, ఏ స్కాం విస్ఫోటనంలా పేలుతుందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అభిశంసించాలని కోరుకుంటున్న అమెరికన్లు ఎక్కువమంది వున్నారని కొత్తగా నిర్వహించిన పోల్‌ ఫలితాలు వెల్లడించాయి. ప్రజలలో ఆయనకున్న ఆదరణ కన్నా అభిశంసనకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. గతంలో ట్రంప్‌కు ఎన్నికల ప్రచారంలో సహాయకుడిగా పనిచేసిన వ్యక్తికి శిక్ష పడడం, ట్రంప్‌ మాజీ న్యాయవాదిపై నేరారోపణలు నమోదైన నేపథ్యంలో ఈ పోల్‌ నిర్వహించారు.

అధికారం నుండి తొలగించేందుకు దారి తీసేలా ఆయనపై అభిశంసన కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తున్నారా అని ప్రశ్నించగా, 49శాతం ప్రజలు అవునని సమాధానమిచ్చారు. 46శాతం మంది లేదు అని జవాబిచ్చారు. ట్రంప్‌ వ్యవహార శైలి ఎలా వున్నా ఆయన పాలనను తాము సమర్ధిస్తామని 36శాతం మంది చెప్పగా, రికార్డు స్థాయిలో60శాతం మంది ఆయన పాలన ఆమోదించేది లేదని స్పష్టం చేసారు.

ఆగస్టు 26 నుండి నాలుగు రోజుల పాటు ఈ పోల్‌ నిర్వహించారు. గత ఏప్రిల్‌లో ట్రంప్‌కు ప్రజల్లో వున్న ఆదరణ 40 శాతంగా వుండగా, వ్యతిరేకత 56శాతంగా వుంది. నాలుగు నెలలు గడిచేసరికి వ్యతిరేకత ఇంకాస్త పెరిగి 60శాతానికి చేరుకుంది. అయితే తనకు ప్రజల్లో మంచి ఆదరణ వుందని, తన సహాయకులపై నేరారోపణలు రుజువైనా అలాంటివి తనను అడ్డగించలేవని ట్రంప్‌ పదే పదే చెబుతున్నారు.