విశ్వాస పరీక్షపై రెండో రోజూ జరుగని ఓటింగ్

 

 

 

కర్ణాటకలో రాజకీయ హైడ్రామా కొనసాగుతూనే ఉన్నది. విశ్వాస పరీక్షను శుక్రవారమే నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా విధించిన రెండు డెడ్‌లైన్లనూ కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు బేఖాతరు చేసింది. 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చే బలపరీక్షపై రెండో రోజు శుక్రవారం కూడా ఓటింగ్ చేపట్టకపోవడంతో కర్నాటకం వచ్చే వారానికి వాయిదా పడింది. స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు. 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి గవర్నర్‌పై పడింది. ఆయన తదుపరి ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సభను వాయిదా వేసేముందు స్పీకర్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. విశ్వాస తీర్మానంపై చర్చ సోమవారం తుదిదశకు చేరుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని పొడిగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు విశ్వాస పరీక్షపై సభలో చర్చ నడుస్తుండగా గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావు సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 

ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసేందుకు ఈ నెల 17న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రతిబంధకంగా మారడంతో విప్ విషయంలో స్పష్టతనివ్వాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని రెబల్ ఎమ్మెల్యేలను బలవంతం చేయలేమని సుప్రీంకోర్టు ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.  

బలపరీక్షను శుక్రవారం మధ్యాహ్నం 1.30లోగా ముగించాలని గురువారం తాను విధించిన గడువు దాటిపోవడంతో గవర్నర్ వాజూభాయ్ వాలా సీఎం కుమారస్వామి శుక్రవారం మరో లేఖ రాశారు. సాయంత్రం 6 గంటల్లోపు ముగించాలని మరో డెడ్‌లైన్ విధించారు. సభలో ప్రభుత్వానికి మెజార్టీ పడిపోయిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

విశ్వాస పరీక్షపై సభలో వాడీవేడీ చర్చ నడిచింది. సభలో చాలా చర్చ జరిగిందని, ఈ రోజు దాన్ని ముగించాలనుకుంటున్నానని స్పీకర్ అన్నారు. చర్చను సాగదీసి చెడ్డపేరు తెచ్చుకోవాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. తాను ప్రాథమికంగా మాట్లాడానని, దీన్ని సోమవారం ముగించొచ్చని పేర్కొన్నారు. బీజేపీ సభ్యుడు సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. విశ్వాస పరీక్షను సాగదీస్తే దాని పవిత్రత పోతుందని, శుక్రవారమే దీన్ని ముగించాలని కోరారు. 

మరోవైపు అర్ధరాత్రి వరకు వేచి ఉండేందుకైనా తాము సిద్ధమేనని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. చర్చలో పాల్గొనేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు పేర్లు ఇచ్చారని, దీంతో సోమవారం కూడా చర్చ నడుస్తుందని, ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నట్లు అంతకుముందు సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలిపారు. గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసేందుకు గవర్నర్‌కు గల అధికారాలపై కూటమి సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు.