రాష్ట్రపతి పాలన దిశగా కర్ణాటక రాజకీయం !

కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి బలపరీక్ష నాటకీయ పరిణామాల మధ్య పలు మలుపులు తిరుగుతోంది. విస్తృత చర్చ అనంతరమే విశ్వాస పరీక్ష చేపట్టాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు పట్టుబడితే..తక్షణమే సీఎం కుమారస్వామి బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌ విధించిన డెడ్‌లైన్‌ దాటిపోవడంతో సాయంత్రం ఆరు గంటల్లోగా బలపరీక్ష చేపట్టాలని గవర్నర్‌ తాజా డెడ్‌లైన్‌ విధించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ నుంచి కర్ణాటక అసెంబ్లీకి సమాచారం అందింది. 

మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ వజుభాయ్‌ వాలా జారీచేసిన ఆదేశాలను స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ బేఖాతారు చేయడంతో బీజేపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు సంసిద్ధమైంది. విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ జరగకపోవడం, అసెంబ్లీలో నెలకొన్న గందరగోళం కర్ణాటకలో రాష్ట్రపతి పాలన దిశగా పరిణామాలు సాగుతున్నాయని భావిస్తున్నారు.

మైనార్టీ ప్రభుత్యం కొనసాగుతున్నా స్పీకర్ సభను సాగదీస్తున్నారని, బలపరీక్షను ఎదుర్కొంటానని ప్రకటించింది ప్రభుత్వమే అయినా పరీక్షకు అవకాశం మాత్రం ఇవ్వడంలేదని గవర్నర్‌కు బీజేపీ మరోసారి ఫిర్యాదు చేయనుంది. అటు స్పీకర్‌ కూడా నేడు గవర్నర్‌ను కలిసి తాజా పరిస్థితులను వివరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘కుమార’ పరీక్ష ఈ రోజు కూడా జరిగే అవకాశాలు కన్పించట్లేదు. రాష్ట్రంలో నెలకొన్న అస్థిర రాజకీయ పరిస్థితులపై కేంద్రానికి ఈ రాత్రికే గర్వర్నర్ ఒక నివేదిక పంపి అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

మరోవైపు విప్‌ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీకి 15 మంది అసమ్మతి ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న సుప్రీం ఉత్తర్వులపైనా ఈ పిటిషన్‌లో స్పష్టత కోరారు. కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ దినేష్‌ గుండూరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.