గవర్నర్ ఆదేశాన్ని ధిక్కరించిన కర్ణాటక సీఎం, స్పీకర్

గవర్నర్ ఆదేశాన్ని ధిక్కరించిన కర్ణాటక సీఎం, స్పీకర్ కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోగా మెజారిటీ నిరూపించుకోవాలన్న గవర్నర్‌ ఆదేశాలను శాసనసభ పట్టించుకోలేదు. గవర్నర్‌ ఆదేశాల ప్రకారం బలపరీక్ష నిర్వహించేందుకు స్పీకర్‌ కేఈఆర్‌ రమేశ్‌కుమార్‌ తిరస్కరించారు. తనను సుప్రీంకోర్టు, గవర్నర్‌ శాసించలేరని అన్నారు. బలపరీక్షలకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ సభ్యులు పదేపదే డిమాండ్‌ చేసినా ఆయన తలొగ్గలేదు. తనను ఒత్తిడికి గురిచేసే వాడు ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. 

బలపరీక్షపై స్పీకర్‌ ఆదేశాలకు కట్టుబడతానని సీఎం కుమారస్వామి తెలిపారు. ‘మధ్యాహ్నం 1.30 గంటల్లోగా బలం నిరూపించుకోవాలని నన్ను స్పీకర్‌ ఆదేశించారు. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాధికారాన్ని స్పీకర్‌కే సుప్రీంకోర్టు వదిలిపెట్టింది. ఇప్పటికే నేను అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను. బలనిరూపణపై నాకు గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారు. ఈ అంశాన్ని ఆయనకే వదిలిపెడుతున్నాన’ని కుమారస్వామి చెప్పారు. తాను నిప్పుల కుంపటిపై కూర్చున్నట్టుగా ఉందని అంతకుముందు స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ చెప్పారు. 

గౌరవంతో బతికే తనను కించపరిచే విధంగా కొంత మంది మాట్లాడుతున్నారని వాపోయారు. అసెంబ్లీలో సభ్యులు మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుందని హెచ్చరించారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోబోనని, చర్చ తర్వాతే బలపరీక్ష జరుగుతుందని స్పష్టం చేశారు. 

తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముళ్లపైనే కూర్చున్నానని, ఆ ముళ్లన్నీ కాంగ్రెస్ వేనని అంటూ కుమారస్వామి అసెంబ్లీలో మిత్రపక్షంపై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ భావించడం లేదని నిప్పులు చెరిగారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, కుమారస్వామి వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో జేడీ(ఎస్), కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో పెను గందరగోళం ఏర్పడింది. 

భోజన విరామం కోసం సభను స్పీకర్‌ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేయడంతో హైడ్రామా కొనసాగుతోంది. మరోవంక, డెడ్‌లైన్‌ విధించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం తగదని కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. తన నిర్ణయాన్ని స్పీకర్‌ ధిక్కరించిన నేపథ్యంలో గవర్నర్‌ వజూభాయ్‌వాలా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.