టీడీపీ పాలనను తలపించే విధంగా జగన్ పాలన

అధికారంలోకి వచ్చి  రెండు నెలలు కాకముందే టీడీపీ పాలనను తలపించే విధంగా  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా  లక్ష్మీనారాయణ విమర్శించారు. జగన్  పరిపాలనలో చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా ఉందని నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తోందని, భవిష్యత్‌లో రాష్ట్రంలో అధికారం పట్టే విధంగా పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోందని కన్నా తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తోందని, అయితే  కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నిధులు చెల్లిస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు తమవేనని ప్రచారం చేసుకొంటున్నదని కన్నా దుయ్యబట్టారు. బీజేపీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాల పేర్లు పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచిదికాదని హితవు చెప్పారు. 

దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల సభ్యత్వాలతో బీజేపీ ముందంజలో ఉందని చెబుతూ బీజేపీ సిద్ధాంతపరంగా పనిచేస్తుందని తెలిపారు. నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో పేదరిక నిర్మూలన, అభివృద్ధి, దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ బీజేపీపై అవాకులు చవాకులు మానుకోవాలని హితవు చెప్పారు. ఆ పార్టీ నాయకులు బీజేపీపై బురదచల్లడం మంచిది కాదని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కుటుంబ పాలనకే పరిమితమైందని విమర్శించారు. ఏపిలో ముఖ్యమంత్రి పదవి ఒక కులానికో, ఒక కుటుంబానికో పరిమితమైందని అన్నారు. భారతీయ జనతాపార్టీలో కుల, మత, కుటుంబాలకు అతీతంగా పాలన సాగిస్తుందని తెలిపారు.