కుమారస్వామి బలపరీక్షకు గవర్నర్‌ డెడ్‌లైన్‌!

కర్ణాటక శాసనసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పలు  నాటకీయ పరిణామాలు జరుగుతూ ఉండగా, తీర్మానంపై ఓటింగ్ జరుపకుండా కాలయాపన చేసుండటం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎంను ఆయన ఆదేశించారు. 

 ‘విశ్వాసపరీక్ష తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి అధిపతిగా ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోకూడదు. కానీ ఈ తీర్మానంపై ఎలాంటి తుదినిర్ణయం తీసుకోకుండా సభ పదేపదే వాయిదా పడుతోందని నాకు ఫిర్యాదు అందింది. భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి ఘటనలు చోటుచేసుకునేందుకు వీల్లేదు’ అని తెలిపారు. 

15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమికంగా మెజారిటీని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. కాగా, గవర్నర్‌ ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖరాసిన విషయాన్ని మంత్రి డి.కె.శివకుమార్‌ ధ్రువీకరించారు.  

అంతకుముందు విశ్వాస పరీక్షను ఈ రోజే పూర్తి చేయాలంటూ గవర్నర్‌ స్పీకర్‌కు ఓ సందేశం పంపారు. అయితే, సభలో ఆందోళన నేపథ్యంలో స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు కుమార ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, బలపరీక్షకు సిద్ధం కావాలని బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. ఈ కూటమికి 98 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, తమకు 105 మంది ఉన్నారని చెప్పారు.

విధానసౌధలో గురువారం జరిగిన విశ్వాసపరీక్షకు అధికార కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు(రెబెల్స్‌తో కలిపి) గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కుమారస్వామి మాట్లాడుతూ..‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు మా సంకీర్ణ ప్రభుత్వంపై దేశమంతటా పలు అనుమానాలు నెలకొనేలా చేశారు. మా ప్రభుత్వం ఐఎంఏ కుంభకోణం, జేఎస్‌డబ్ల్యూ కుంభకోణంలో చిక్కుకుందని నిరాధార ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ విషయంలో మేం దేశ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశమంతా కర్ణాటకవైపు చూస్తోంది’ అని తెలిపారు.