బల పరీక్ష ఈ రోజే జరపాలన్న గవర్నర్, సభ వాయిదా

 కర్ణాటక అసెంబ్లీ వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు తిరిగి సభ నిర్వహించనున్నారు. విప్‌ విషయంలో సుప్రీం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవంటూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. మరోవైపు దీనిపై బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమ ఎమ్మెల్యేలంతా రాత్రంతా ఇక్కడే ఉంటారని, ఇక్కడే ధర్నా చేస్తారని ఆ పార్టీ నేత యడ్యూరప్ప ప్రకటించారు. 

వాయిదా అనంతరం కాంగ్రెస్‌- జేడీఎస్‌ సభ్యులు బయటకు రాగా.. బిజెపి ఎమ్మెల్యేలు మాత్రమే సభలోపలే ఉండిపోయారు.  కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కుమారస్వామికి తగు బలం లేదని గ్రహించి బలపరీక్షను వాయిదా వేసేందుకు కాంగ్రెస్ ఉందయం నుండి ప్రయత్నం చేసూనే ఉంది. ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలతో కర్నాటక రాజకీయ సంక్షోభం గందరగోళంగా మారింది.  

మరోవైపు నేటి రాత్రి కల్లా బలపరీక్ష జరిగేలా చూడాలని రాష్ట్ర గవర్నర్‌ వాజూభాయి పటేల్‌.. స్పీకర్‌ రమేశ్ కుమార్‌కు సందేశం పంపారు. 

 విశ్వాస పరీక్ష వాయిదా వేయాలంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు,  ఈరోజే నిర్వహించాలంటూ బీజేపీ నేతలు పోడియం వద్దకు దూసుకు రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో  స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ సభను 30 నిమిషాలు వాయిదా వేశారు. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేశారని కాంగ్రెస్‌ పార్టీ సభలో సంచలన ఆరోపణలు చేసింది. 

కిడ్నాప్‌కు సంబంధించి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇచ్చారని మంత్రి డీకే శివకుమార్‌ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని స్పీకర్‌కు కోరారు.  

ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు తీర్పు అస్పష్టంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసపరీక్ష పెట్టడం సరికాదని కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య కోరగా, దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. బలపరీక్ష వాయిదా వేయడం కోసమే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని ఆందోళనకు దిగింది. 

ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రెండు సార్లు సభను వాయిదా వేసిన స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌.. సాయంత్రం 4.30 గంటల తర్వాత తిరిగి సభను ప్రారంభించారు.  

ఇదిలా ఉండగా.. విశ్వాస పరీక్ష ఆలస్యం చేయడంతో బిజెపి  నేతలు గవర్నర్‌ను కలిశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు బలపరీక్ష జరిగే చూడాలని కోరుతూ వినతి పత్రం అందించారు. దీంతో రాజ్‌భవన్‌ గవర్నర్‌ వాజూభాయి ఓ ప్రత్యేక అధికారి ద్వారా స్పీకర్‌కు ఓ లేఖ పంపారు. 

ఆ లేఖను స్పీకర్‌ చదివి వినిపించారు. ఎలాగైనా ఈ రోజు రాత్రికల్లా బలపరీక్ష జరిగేలా చూడాలని గవర్నర్‌ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అటు స్పీకర్‌ కూడా ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు. ఈ రోజే విశ్వాస పరీక్ష జరిగేలా చూస్తామని చెప్పారు.