బీజేపీలో చేరిన అల్పేష్ ఠాకూర్, ఝలా

గుజరాత్‌ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ  కాంగ్రెస్ ఎమ్యెల్యేలు నేడు బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన  రాజ్యసభ ఎన్నికలలో వారిద్దరూ బిజెపి అభ్యర్థులకు  ఓట్ వేసిన అనంతరం తమ శాసనసభ్యతాలకు రాజీనామా చేశారు. 

కాంగ్రెస్ ఎమ్యెల్యేగా వైదొలిగిన అల్పేష్ ఠాకూర్, తన సహచరుడు, ఎమ్మెల్యే ధావల్‌ సింగ్‌ ఝలాతో కలిసి గురువారం  గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు జితూ వాఘానీ సమక్షంలో ఇరువురు నేతలు బీజేపీలో చేరారు.

కాగా అల్పేష్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని గుజరాత్‌ క్షత్రియ ఠాకూర్‌ సేన (జీకేటీఎస్‌) ఠాకూర్‌ బీజేపీ గూటికి చేరతారని ఇప్పటికే వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అల్పేష్‌, ఝలా ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ పార్టీ తమను అవమానించిందని, తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. కాగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్‌ 2017లో అల్పేష్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌లో చేరి రధన్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఝలా అరవల్లి జిల్లా బయద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.