బలపరీక్ష తీర్మానంపై కర్ణాటక సంకీర్ణం సాగతీత ధోరణి !

 క‌ర్నాట‌క అసెంబ్లీలో ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి ఎట్టకేలకు బ‌ల‌పరీక్ష కోసం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. స్పీక‌ర్ ర‌మేశ్ పాత్ర‌పైన కూడా కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నార‌ని సీఎం త‌న ప్ర‌సంగంలో ఆరోపించారు. అయితే ఈ తీర్మానంపై సుదీర్ఘ చర్చకు దారితీయడం ద్వారా సోమవారం వరకు ఓటింగ్ జరుగకుండా చేసేందుకు సంకీర్ణ ప్రభుత్వం సాగతీత ధోరణి ఆవలంభిస్తున్నది.

కానీ విశ్వాస‌ప‌రీక్ష‌పై చ‌ర్చ ఒక్క రోజు మించ‌కుండా నిర్వ‌హించాల‌ని ప్ర‌తిప‌క్ష నేత బీఎస్ య‌డ్యూర‌ప్పకోరారు. విశ్వాస‌ప‌రీక్ష‌పై చ‌ర్చ ఒక్క రోజు మించ‌కుండా నిర్వ‌హించాల‌ని ప్ర‌తిప‌క్ష నేత బీఎస్ య‌డ్యూర‌ప్ప కోరడంతో రూల్ 164 ప్ర‌కార‌మే చ‌ర్చ జ‌రుగుతుంద‌ని స్పీక‌ర్ కేఆర్ ర‌మేశ్ కుమార్ చెప్పారు. రెబ‌ల్ ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వంపై సుప్రీంకోర్టు ముందు ఆరోప‌ణ‌లు చేశార‌ని, వాటిని క్లారిఫై చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం కుమార‌స్వామి స్పష్టం చేశారు. చ‌ర్చ లేకుండా బ‌ల‌ప‌రీక్ష ఉండ‌ద‌ని సీఎం తేల్చి చెప్పారు.

మరోవైపు విశ్వాస పరీక్ష ప్రక్రియను త్వరగా  పూర్తిచేయాలని బిజెపి నేత యడ్యూరప్ప పట్టుబడుతున్నారు. రెబ‌ల్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక బీఎస్పీ ఎమ్మెల్యే కలుపుకొని మొత్తం 21 మంది ఇవాళ స‌భ‌కు హాజరు రాలేదు. రెబ‌ల్ జ‌ట్టులో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపు రాజ్యాంగ మూలాల‌ను ధ్వంసం చేస్తున్న‌ద‌ని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య ధ్వజమెత్తారు.

పార్టీ ఫిరాయింపు అవినీతి రాజ‌కీయాల‌కు తెర‌లేపుతుంద‌ని చెబుతూ . రాజీనామా చేసినా, విప్‌ బేఖాతరు చేసినా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను సిద్దరామయ్య  కోరారు. దీంతో స‌భ‌లో ఉన్న బీజేపీ స‌భ్యులు భారీ స్థాయిలో వ్య‌తిరేక నినాదాలు చేశారు. కాంగ్రెస్ పక్షనేత కావాలి అనుకొంటే తమ సభ్యులకు విప్ జారీ చేసుకోవచ్చని స్పీకర్ స్పష్టం చేశారు.

ఇలా  ఉండగా, ఎమ్మెల్యేల అనర్హత అంశం గురించి స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ, ప్రస్తుత, భవిష్యత్‌ సీఎంల మధ్య తాను ఇరుక్కుపోయానని వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సభ గౌరవిస్తుంది. అదే సమయంలో సభా నియమాలు ఉల్లంఘన కాకూడదు. అసంతృప్త ఎమ్మెల్యేలకు ఏ సమస్యలైనా ఉండొచ్చు. సభా సమావేశాలు జరుగుతుంటే వాళ్లు బయట ఉండాలంటే మాత్రం సభ అనుమతి తప్పనిసరి. అంతకుమించి సుప్రీం తీర్పులో సభ జోక్యం చేసుకోదు’ అని స్పష్టం చేశారు.