జులై 31 వరకు అయోధ్య మధ్యవర్తిత్వం

అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూవివాదం సమస్య పరిష్కారంలో మరికొద్ది రోజులు మధ్యవర్తిత్వమే కొనసాగనుంది. అయోధ్య కేసుపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జులై 31 వరకు మధ్యవర్తిత్వం కొనసాగించాలని కమిటీని ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను ఆగస్టు 1న ఇవ్వాలని సూచించింది.

 దాన్ని పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణపై ఆగస్టు 2న నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి అవకాశముంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. 

సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా, ‘‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే మధ్యవర్తిత్వ ప్రక్రియలో పురోగతి చోటుచేసుకోవడం లేదని, దాన్ని రద్దు చేసి న్యాయస్థానమే విచారణ జరపాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. 

ఈ పిటిషన్‌పై జులై 11న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న పురోగతిని తెలియజేస్తూ ఈ నెల 18లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

 కోర్టు ఆదేశాల నేపథ్యంలో మధ్యవర్తిత్వ కమిటీ నేడు నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన ధర్మాసనం.. పై విధంగా తీర్పు వెల్లడించింది.