24న కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.  23న భువనేశ్వర్‌ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకొని వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం విజయవాడ చేరుకుంటారు. 

విజయవాడలో  గత ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రకటన (నోటిఫికేషన్‌) జారీ చేయనుంది. భవనంలో మొదటి అంతస్థుని గవర్నర్‌ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజులుగా భవనంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి కొత్తగా పలు సదుపాయాలు కల్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి  జగన్‌ మోహన్ రెడ్డి తరఫున ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం భువనేశ్వర్‌లోని బిశ్వభూషణ్‌ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రవీణ్‌ ప్రకాష్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జారీ చేసిన నియామక పత్రాన్ని అందజేశారు.  

గౌరవప్రదమైన గవర్నర్‌ పదవిని చేపట్టబోతున్న తాను రాజకీయాలకు అతీతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌ నేత బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. పురోగమన భావాలున్న ప్రజానేత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. తనకు రాజ్యాంగబద్ధ పదవి వరించడం వెనుక పూరీ జగన్నాథుని ఆశీస్సులు, ప్రజల అందడండలు ఉన్నాయని పేర్కొన్నారు.   

"గవర్నర్‌ పదవి అన్నది గౌరవప్రదమైనది. రాజకీయాలకు దూరంగా ఉంటాను. నా కర్తవ్యం నేను చేస్తాను" అని తెలిపారు.