కుల్‌భూషణ్‌ కేసులో తీర్పు.. మోదీ హర్షం

పాక్‌ చెరలో ఉన్న భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. తీర్పును స్వాగతిస్తున్నామని ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. 

ఈ తీర్పుతో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయని తెలిపారు. నిజానిజాలను పరిశీలించి వాటి ఆధారంగా తీర్పు ఇచ్చినందుకు అంతర్జాతీయ న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. కుల్‌భూషణ్‌ జాదవ్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ప్రతి భారతీయుడి సంక్షేమానికి పాటుపడుతుందని వెల్లడించారు.   

కాగా, పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో జాదవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో సమర్ధంగా వాదనలు వినిపించారని కేంద్ర విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో పోస్టు చేశారు. 

అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు ఈ కేసును తీసుకువెళ్లిన ప్రధాని నరేంద్రమోదీకి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరణశిక్షను నిలుపుదల చేయడం భారత విజయమని కొనియాడారు. ఈ చర్య జాదవ్‌ కుటుంబీకులకు సాంత్వన కలిగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.