అమెరికా జిడిపిలో రెండు వంతులు వలసల వారిదే

అమెరికాకు ఇతర దేశాల నుంచి వచ్చే వలసవాసులపై అమానుషంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ ప్రభుత్వ కళ్లు తెరిపించే వాస్తవం ఒకటి తాజా అధ్యయనంలో బయటపడింది. అమెరికా మొత్తం సంపదలో మూడింట రెంగొంతులు అమెరికాకు వలస వచ్చిన జనం సృస్టించినదేనని ఈ అధ్యయనంలో తేలింది. 2011 నుండి ఈ పరిస్థితి నెలకొందని సిటీ గ్రూప్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ అధ్యయన నివేదిక తెేలిపింది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఈ నివేదికను ప్రచురించింది.

వలసల్లో కోత విధిస్తే దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినగలవని, అలాగే నూతన ఆవిష్కరణలకు కూడా ఆటంకం కలుగుతుందని అది హెచ్చరించింది. అమెరికా జనాభాలో వలస వచ్చిన జనం కేవలం 14శాతమే వున్నా 40శాతం చిల్లర వ్యాపారాలు వారివేనని వెల్లడించింది.

2011 తర్వాత అమెరికాలో సాగిస్తున్న వ్యాపార వాణిజ్యాల్లో 30శాతం వారిదేనని తెలిపింది. వీటిలో సగానికిపైగా స్టార్టప్‌ వ్యాపారాలేనని, వాటి విలువ వంద కోట్ల డాలర్లుపై మాటేనని పేర్కొంది. పేటెంట్లు తీసుకున్న ఆవిష్కరణలు సృష్టించిన వారిలో లేదా నోబెల్‌ బహుమతి పొందిన వారిలో వలసవాసులు రెండు రెట్లు కన్నా ఎక్కువగా వున్నారు, వీరు ట్రంప్‌ ప్రభుత్వానికి చెల్లించే పన్నులు కన్నా ఉపయోగించుకునే ప్రభుత్వ ప్రయోజనాలు చాలా తక్కువగా వున్నాయి.

వలస వచ్చిన కార్మికుల నుండి సిలికాన్‌ వ్యాలీ వంటి ప్రాంతాలు చాలా ప్రయోజనాలు పొందుతున్నాయి, అదే సమయంలో విస్కాన్సిన్‌ వంటి రాష్ట్రంలో వీరి ప్రభావం అంతగా లేదు. దాంతో ప్రాంతీయ అసమానతలు కూడా కొంత మేర పెరిగాయని అధ్యయనం విశ్లేషించింది. ఇతర దేశాల్లోని పరిస్థితిపై కూడా ఈ గ్రూపు అధ్యయనం చేసింది. 1990ల్లో బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్‌ను నిలుపుచేసినట్లైతే ఈనా డున్న పరిస్థితి కన్నా 9శాతం తక్కువగా ఆర్థిక వృద్ధి వుండేదని పేర్కొంది. జర్మనీకి ఈ పరిస్థితి వర్తింపచేస్తే ఆరు శాతం వృద్ధిరేటు తగ్గి వుండేదని తెలిపింది.