అసోంకు రూ.250 కోట్ల కేంద్ర సాయం

అసోంలో కుంభవృష్టితో తలెత్తిన వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలోని 33 జిల్లాలు వరద ముంపునకు గురికాగా, ఇంతవరకూ మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. 45 లక్షల మందికి పైగా ప్రజలు వరదల కారణంగా దెబ్బతిన్నారు. దీనిపై కేంద్రం వేగంగా స్పందించింది. 

సహాయక పనులకు గాను తక్షణ సాయంగా కేంద్రం రూ.251.55 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తుల నివారణ నిధికి (ఎస్‌డీఆర్‌ఎఫ్)కి ఈ మొత్తాన్ని విడుదల చేసింది. శీఘ్రగతిన కేంద్ర స్పందించి నిదులు విడుదల చేయడంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు అసోం ఆర్థిక మంత్రి హిమాంత బిస్వా శర్మ ఓ ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, వరద ముంపునకు గురైన జిల్లాల్లో బ్రహ్మపుత్ర, దాని ఉప నదులు ప్రమాద స్థాయి నుంచి ప్రవహిస్తున్నట్టు రాష్ట్ర విపత్తుల నివారణ కమిటీ వెల్లడించింది. రాజధాని గౌహతి కూడా వరద ముంపునకు గురికావడంతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలోని 4,620 గ్రామాల్లో 45 లక్షల మందికి వర్షాలు, వరదల కారణంగా దెబ్బతినగా, లక్షలాది మందిని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 226 సహాయ శిబిరాలకు తరలించారు. 

బాధితులను ఆదుకునేందుకు 562 ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సైనిక దళాలు, బీఎస్‌ఎఫ్ దళాలు సహాయక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నాయి. వరదలతో తలెత్తిన పరిస్థితి దృష్ట్యా ఈనెల 18 నుంచి ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాలను 26వ తేదీకి వాయిదా వేశారు.