సుప్రీం తీర్పుతో పశ్నార్ధకరంగా కుమారస్వామి భవిష్యత్ !

ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం అనేది పూర్తిగా స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌కే వదిలేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసినా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భవిష్యత్ ప్రశ్నార్ధకరంగానే కొనసాగుతున్నది. పదిరోజులకు పైగా నెలకొన్న కర్ణాటక రాజకీయ సంక్షోభానికి పరిష్కారం దొరకటం లేదు.

ఎమ్మెల్యేలను బలవంతం చేయలేమని న్యాయస్థానం చెప్పడం కుమారస్వామి ప్రభుత్వానికి కంటకప్రాయంగా మారింది. గురువారం ఉదయం అసెంబ్లీలో కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ 15 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది. శాసనసభలో బిజెపి సంఖ్యా బలం 105. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి 107. అటు జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంఖ్యా బలం 101 మాత్రమే. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో కుమార నెగ్గే అవకాశాలు కన్పించట్లేదు.

అందుకనే సుప్రీం తీర్పుపై బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ తీర్పు ప్రజాస్వామ్య విజయం. ఎమ్మెల్యేల నైతిక విజయం. రెబల్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం విప్‌ జారీ చేయలేదు. దాంతో విశ్వాసపరీక్షలో కుమారస్వామి నెగ్గలేదు. ఇక ప్రభుత్వం కూలడం ఖాయం. రేపే ఆఖరితేదీ’ అని యడ్యూరప్ప స్పష్టం చేశారు.

రాజీనామాలపై కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించలేమని సుప్రీం కోర్ట్ పేర్కొంది. అయితే రేపు బలపరీక్షకు హాజరుకావాలా వద్దా అన్నది మాత్రం ఎమ్మెల్యేల ఇష్టమని వెల్లడించింది. విశ్వాసపరీక్షకు హాజరుకావాలని ఎమ్మెల్యేలను బలవంతం చేయలేమని వెల్లడించింది.

తీర్పు అనంతరం అసంతృప్త ఎమ్మెల్యేల తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి కర్ణాటక అసెంబ్లీలో రేపు విశ్వాసపరీక్ష ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రెండు కీలక విషయాలు వెల్లడించిందని తెలిపారు. ఒకటి రెబల్స్‌పై ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ స్పీకర్‌కు ఉంది. ఇక రెండోది సుప్రీంను ఆశ్రయించిన 15 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షకు హాజరుకావాలా వద్ద అనేది వారి ఇష్టం. అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్యేలను బలవంతం చెయ్యలేమని చెప్పింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో రెబల్స్‌ ఎమ్మెల్యేలపై సంకీర్ణ ప్రభుత్వం జారీ చేసిన మూడు లైన్ల విప్‌ పనిచేయదని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక స్పీకర్‌ రమేశ్ కుమార్‌ స్వాగతించారు. రాజీనామాలపై ఆలస్యం చేయబోనని, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తెలిపారు.