జంట పేలుళ్ల కేసులో ఇద్దరికీ ఉరిశిక్ష

గోకుల్‌చాట్‌, లుంబినీ పార్క్‌ జంట పేలుళ్ల కేసులో పేలుళ్ల కేసులో దోషులిద్దరికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏ-1, ఏ-2 ఇద్దరు దోషులకు సోమవారం సాయంత్రం ప్రత్యేక  న్యాయస్థానం ఉరి శిక్ష విధిస్తూ పోలీసులకు ఆదేశాలు చేసింది. రూ. 10వేలు జరీమానా విధించింది. వారిద్దరికి ఆశ్రయం కల్పించిన తారీఖ్‌ అంజుంకు జీవిత ఖైదు విధించింది.

గోకుల్‌చాట్‌, లుంబినీ పార్క్‌ జంట పేలుళ్ల కేసులో ఇద్దరు దోషులకు రెండో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సోమవారం ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. లుంబినీ పార్కులోని లేజర్‌ షో వద్ద బాంబు పెట్టిన అనీఖ్‌ షఫీఖ్‌ సయ్యద్‌(ఏ1), దిల్‌సుఖ్‌నగర్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కింద బాంబు పెట్టిన మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి(ఏ2)లను చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 4న దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే.

మరో ఇద్దరు నిందితులు ఫరూఖ్‌ షఫ్రుద్దీన్‌ టార్కస్‌, మహ్మద్‌ సాదిక్‌ ఇస్రార్‌ అహ్మద్‌ షేక్‌‌ను నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల అనంతరం నిందితులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన తారీఖ్‌ అంజుం హసన్‌‌కు ఏవజ్జీవ ఖైదు విధించింది.

ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం తీర్పు చెప్పింది. 8 మంది నిందితుల్లో ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చింది. సూత్రధారులై న రియాజ్‌భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌, అమిర్‌ రజా ఖాన్‌లు పరారీలో ఉండటంతో వారిపై విచారణ ఇంకా మొదలు కాలేదు. దోషులకు సోమవారం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో చర్లపల్లి జైలు పరిసరాల్లో పోలీసులు భద్రతను పెంచారు.

ఈ కేసులో సోమవారం తుది విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మహ్మద్‌ తారిఖ్‌ అంజుమ్‌ను సోమవారం ఉదయమే దోషిగా తేల్చింది.

2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని గోకుల్‌ఛాట్‌, లుంబినీపార్కుల వద్ద జరిగిన జంట పేలుళ్లలో 44 మంది అమాయకులు మరణించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పోలీసు శాఖలోని కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం కేసు దర్యాప్తు చేసి అభియోగపత్రాలు దాఖలు చేసింది. 

బాంబులు పెట్టిన అనీక్‌ షఫీక్‌ సయీద్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి నేరం చేసినట్లు న్యాయస్థానం తేల్చింది. మరో ఇద్దరు నిందితులైన సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌, ఫరూక్‌ షర్ఫుద్దీన్‌ తర్ఖాష్‌లను నిర్దోషులుగా పేర్కొంది.