ఇక డిజిలాకర్‌లో డ్రైవింగ్ లైసెన్స్

వాహనాలపై ప్రయాణం చేసేవారు ఇకనుండి డ్రైవింగ్ లైసెన్స్, భీమా తదితర పత్రాలను తమతో తీసుకు వేల్లనవసరం లేదు. ఎందుకంటే వాటిని డిజిలాకర్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకూ డిజిలాకర్‌లో వాహనాలకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించినా పోలీసులు వాటిని పరిగణించలేదు. కానీ ఇప్పటి నుంచి డిజిలాకర్‌లో చూపించే ధ్రువీకరణ పత్రాలు పరిగణలోకి తీసుకోవాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు పంపించింది.

వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ఏ పత్రాలనైనా డిజిలాకర్‌ యాప్‌ లేదా ఎంపరివాహన్‌ మొబైల్‌ యాప్‌లో భద్రపరుచుకోవచ్చు. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను ఆపినప్పుడు ఒరిజినల్‌ ధ్రువపత్రాల స్థానంలో డిజిలాకర్‌లో ఉన్న వాటిని చూపిస్తే సరిపోతుంది. ఈ నిబంధన నేటి నుంచే అమల్లోకి వస్తుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

బిహార్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో తొలిసారిగా డిజిలాకర్‌లో ఉన్న పత్రాలను లీగల్‌ డాక్యుమెంట్స్‌గా పరిగణించారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా డిజిలాకర్‌ లేదా ఎంపరివాహన్‌ యాప్‌లో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్యూరెన్స్‌ కాగితాలు, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలను అధికారికంగా ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలని ఆదేశించింది.

డిజిలాకర్‌లో ఉన్న వాహనపత్రాలను చూపిస్తే పోలీసులు వాటిని అధికారిక పత్రాలుగా గుర్తించడం లేదని పలువురు వాహనాదారులు కేంద్ర రవాణాశాఖకు ఫిర్యాదులు చేశారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రైల్వే ప్రయాణికులకు కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

రైళ్లలో ప్రయాణించే సమయంలో ఐడీ ఫ్రూఫ్‌గా ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు బదులుగా వాటి సాఫ్ట్‌ కాపీలు చూపిస్తే సరిపోతుందని రైల్వే శాఖ అధికారులు గతంలో ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ డిజిలాకర్‌ను ప్రవేశపెట్టారు.