కేంద్రమంత్రులపై ప్రధాని అసహనం!

పార్లమెంటు సమావేశాలకు కేంద్ర మంత్రులు గైర్హాజరు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా శాఖలపై మంత్రులు పట్టు సాధించట్లేదని ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. సభకు సరిగా హాజరు కాని.. రోస్టర్‌ విధుల్ని సరిగా అమలు చేయని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషిని ప్రధాని ఆదేశించినట్లు సమాచారం. 

 ఉదయం జరిగిన బిజెపి  పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 2025నాటి లక్ష్యాలకనుగుణంగా బిజెపి ఎంపీలకు ప్రధాని పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయి అధికారులతో కూర్చొని నియోజకవర్గ స్థాయి సమస్యలపై దృష్టి సారించాలని హితవు చెప్పారు. జంతువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. 

క్షేత్రస్థాయి సమస్యలకు వినూత్న పరిష్కారాలతో ముందుకు రావాలని సూచించారు. క్షయ, కుష్ఠు, దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలకనుగుణంగా పనిచేయాలని ఎంపీలను మోదీ ఆదేశించారు. దీనిపై స్పందించిన ప్రహ్లాద్‌ జోషి.. సమావేశాలకు హాజరయ్యే అంశంలో బిజెపిసభ్యులకు ఎటువంటి మినహాయింపు లేదని ప్రధాని అభిప్రాయపడ్డట్లు తెలిపారు.

ఈ నెల ఆరంభంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ మోదీ నేతల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. క్రమశిక్షణారాహత్యంగా ప్రవర్తిస్తే ఎవరినైనా పార్టీ నుంచి బహిష్కరించడానికి వెనకాడేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. పరోక్షంగా భాజపా సీనియర్ నేత కైలాష్‌ విజయవర్గీయ తనయుడు ఆకాశ్ వర్గీయ అధికారులపై దాడి చేయడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.