సిట్‌ అదుపులో కర్ణాటక ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌

కర్ణాటకలో  తాజాగా కాంగ్రెస్‌ నుంచి సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ను ఐఎమ్‌ఏ అవినీతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌ ) అదుపులోకి తీసుకుంది. భాజపా నేత యడ్యూరప్ప వ్యక్తిగత కార్యదర్శి సంతోష్‌తో కలిసి ముంబయి పయనానికి సిద్ధమైన రోషన్‌ బేగ్‌ను సిట్‌ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ విషయాలను ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సిట్‌ అధికారులను చూసిన సంతోష్‌ వెంటనే అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. ఆ సమయంలో బిజెపి ఎమ్మెల్యే యోగేశ్వర్‌ సైతం సంఘటనా స్థలంలో ఉండడం అనుమానాలు రేకెత్తిస్తోందని ఆరోపించారు.

అవినీతి కేసులో ఉన్న ఓ వ్యక్తిని బీజేపీ కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కుమారస్వామి ఆరోపించారు. దీన్ని సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకి యత్నిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గురువారం జరగబోయే బలపరీక్షలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

దీనిపై స్పందించిన బీజేపీ .రోషన్‌ బేగ్‌తో కలిసి సంతోష్‌ పయనిస్తున్నాడన్న ముఖ్యమంత్రి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. కుమారస్వామి అవాస్తవాలతో బీజేపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం యడ్డ్యూరప్ప ఆరోపించారు. ఆ సమయంలో విమానాశ్రయంలో కేవలం రోషన్‌ బేగ్‌ మాత్రమే ఉన్నారని, బోర్డింగ్‌ పాస్‌లు, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. 

ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల కింద రోషన్‌ బేగ్‌ను కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన జులై 8న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరతానని ప్రకటించారు.

బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న రోషన్‌ బేగ్‌ను సిట్‌ అధికారులు నేరుగా సిఐడీ ప్రధాన కార్యాలయం కార్ల్‌టన్‌ హౌస్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడే విచారణ కొనసాగుతోంది. మరోవైపు రోషన్‌ బేగ్‌ని అదుపులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆయన న్యాయవాది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.