అసదుద్దీన్‌పై విరుచుకు పడ్డ మంత్రి అమిత్ షా

అత్యంత కీలకమైన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ నియా) బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ దశలో హైదరాబాద్ ఎంపి, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ, కేంద్ర మంత్రి అమిత్ షా మధ్య తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధం జరిగింది. సభలో చర్చల దశలో ముందు ఇతరులు ఏమి చెపుతారో వినడం నేర్చుకుంటే మంచిదని అసదుద్దీన్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు.

దేశంలో ఉగ్రవాద కట్టడికి అత్యంత కీలకమైన సంస్థగా నియా వ్యవహరిస్తోంది. దీనికి విశేష విస్తృతాధికారాలను కట్టబెడుతూ జాతీయ దర్యాప్తు సంస్థ (సవరణ) బిల్లును సభలో హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఎన్‌ఐఎకు ఉగ్రవాద కట్టడి సంబంధిత ఇతర అంశాలను కూడా అప్పగించేందుకు బిల్లులో ప్రతిపాదనలు చేశారు.

సైబర్ క్రైమ్, మానవ అక్రమ రవాణా, విదేశాలలో భారతీయులపై దాడుల నివారణ వంటి అంశాలలో కూడా సంస్థకు అధికారాలను అప్పగించేందుకు సంకల్పించారు. సంస్థకు విశేషాధికారాలు అప్పగించే బిల్లుతో భారతదేశం పోలీసు రాజ్యం అవుతుందని, చట్టం దుర్వినియోగం అవుతుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. 

ఈ బిల్లులోని అంశాలు జాతీయ ప్రయోజనాల కోణంలో చాలా మంచివని, దీనిని ఎవరూ కాదనలేరని చర్చ దశలో అంతకు ముదు బిజెపి సభ్యులు సత్యపాల్ మాలిక్ తెలిపారు. నియాకు సరైన అధికారాలు సముచితం అని, లేకపోతే కీలక దర్యాప్తులు పక్కదోవపడుతాయని చెప్పారు. 

హైదరాబాద్‌లో ఒక కేసు దర్యాప్తు క్రమాన్ని మార్చాలని ఓ దశలో నగర పోలీసు కమిషన్‌ను ఒక రాజకీయ పార్టీ నేత బెదిరించారని, లేకపోతే ముంబైకి బదిలీ చేయిస్తానని చెప్పారని మాలిక్ పేర్కొనడంతో ఆయన ప్రసంగాన్ని అసదుద్దిన్ అడ్డుకుంటూ చెప్పడం కాదు దీనికి రుజువులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. నియాకు అపరిమిత అధికారాలు అనుచితం అని అన్నారు. జాతీయ ప్రయోజనాల కోణంలో ఏదో చేస్తున్నామనే గొప్పలకు పోవద్దని ఒవైసీ పేర్కొన్నారు. 

ఈ దశలో హోం మంత్రి అమిత్ షా లేచి ఒవైసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సభ్యుల లౌకికవాదం మరీ శృతిమించుతోందన్నారు. సభలో ఉన్నప్పుడు ఎదుటి పక్షం చెప్పేది విన డం నేర్చుకోవల్సి ఉంటుందని, అప్పుడే అన్ని విషయాలు తెలిసి వస్తాయని, ముందు చెప్పేది వినడం నేర్చుకుంటే సరైన విధంగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుందన్నారు.

సున్‌నా సీఖో ఒవైసీ సాబ్ అని వ్యాఖ్యానించారు. ఈ దశలో ఒవైసీ అమిత్ షా మధ్య వాదోపవాదం చెలరేగింది. చట్టం దుర్వినియోగం అంటూ జరగబోదని, అంతేకాకుండా నిందితుల మతంతో సంబంధం లేకుండా ఉగ్రవాదం అణచివేతకు సరైన వాతావరణం ఏర్పడుతుందని షా తెలిపారు. 

నియా చట్టాన్ని మోడీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తుందనే రీతిలో ఒవైసీ మాట్లాడుతున్నారని , తమ ప్రభుత్వం మత ప్రాతిపదికన ఎప్పుడూ చట్టాన్ని వాడలేదని, అయితే నిందితుడు ఏ మతం వాడయినా ఉగ్రవాదం ఆటకట్టుకు దీనిని వాడుకోవడం జరుగుతుందని మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. ఉగ్రవాదం పట్ల యుపిఎ ప్రభుత్వం మెతక వైఖరిని అవలంభించిందని, అప్పట్లో పోటా ఎత్తివేతకు దిగింది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగం అని, దుర్వినియోగం జరిగిందనేది కేవలం సాకు అని అమిత్ షా విమర్శించారు. 

పోటా ఎత్తివేత దశలో యుపిఎ హయాంలో దేశంలో ఉగ్రవాద చర్యలు మితిమీరాయని , దీనితో చేసేది లేక కేంద్రం ముంబై దాడుల తరువాత నియాను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉగ్రవాదం ఆటకట్టుకు కేవలం వ్యవస్థ ఉంటే సరిపోదని, వ్యవస్థకు సరైన అధికారాలు ఉండాలని, సభలో అన్ని పక్షాలూ చట్టానికి సరైన విధంగా సహకరించాలని ప్రభుత్వం కోరుతోందని చెప్పారు. బిల్లుపై వ్యతిరేకతలు ఉన్నట్లు వెల్లడయితే ఉగ్రవాదులు బలోపేతం అవుతారని, ఈ విధమైన తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని షా సూచించారు. 

సభ అంతా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాలనే వాదనను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి. ఇటువంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకొంటోందని తెలిపారు. ఒక నిర్థిష్ట మతం వారిని వేధించేందుకు దుర్వినియోగపర్చిన సందర్బాలు ఉన్నాయని కొందరు ఎంపిలు తెలిపారు. అయితే మోడీ ప్రభుత్వానికి అటువంటి ఉద్ధేశాలు లేవని, కేవలం ఉగ్రవాదాన్ని నిర్మూలించే లక్షంతోనే దీనిని తలపెట్టినట్లు హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఫలానా మతం వారని చెప్పి దీనిని వాడటం జరగదు. అదే విధంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారు ఏ మతం వారయినా వదిలేది లేదని స్పష్టం చేశారు.

సభలో బిల్లును తీసుకువచ్చిన సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఉగ్రవాదం దేశానికి విషపురుగుగా మారిందని, అగ్రనేతలు ఎందరో ఈ సమస్యతో బలి అయ్యారని తెలిపారు. కొత్త చట్టంతో విదేశాల్లో కూడా ఉగ్రవాద చర్యలలో భారతీయులు ముప్పు ఏర్పడితే దర్యాప్తు చేసేందుకు వీలేర్పడుతుందన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడం జరుగుతుందని, బిల్లు జాతీయ ప్రయోజనాల కోణంలో తీసుకువచ్చినట్లు తెలిపారు.