బిజెపిలోకి మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు!

సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ బీజేపీలో చేరడానికి సిద్దపడిన్నట్లు తెలిసినది. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి, ఎస్పీ  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇంకో సంవత్సరం పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.  బీజేపీ ఆయనను ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 

ఈయన 2007 లో జరిగిన ఉప ఎన్నికల్లో తన తండ్రి నియోజకవర్గమైన బల్లియా నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 2009 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా తిరిగి అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అయితే తాజా సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని అఖిలేశ్ యాదవ్‌ని అడిగితే అందుకు ఆయన తిరస్కరించారు. తర్వాత ఆయనను రాజ్యసభకు పంపించారు. 

కానీ, అఖిలేశ్‌తో ఆ వైరం కొనసాగుతూనే ఉంది. ఈ వైరంతోనే ఆయన పార్టీనుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీ వర్గాలు తెలిపాయి.రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడిని కలిసి నీరజ్ రాజీనామా లేఖను సమర్పించారు. తాను స్వచ్ఛందంగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నీరజ్ పేర్కొనడంతో ఛైర్మన్ ఆమోదించారు.