సోనియా, రాహుల్‌లకు చుక్కెదురు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీకి చుక్కెదురు అయింది. 2011-2012 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రీ-అసెస్‌మెంట్‌ కోరుతూ ఆదాయం పన్ను శాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ సోనియా, రాహుల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. పన్ను ప్రొసీడింగ్స్‌ను తిరిగి తెరిచే అధికారం ఆదాయం పన్ను శాఖకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. సమస్యలు ఏమైనా ఉంటే ఆదాయం పన్ను శాఖనే పిటిషనర్లు సంప్రదించాలని సూచించింది.

 యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ)కు రీ-ఎసెస్‌మెంట్ నోటీసులు పంపడంలో ఆదాయం పన్ను శాఖకు 'దురుద్దేశాలు' ఉన్నాయని సోనియాగాంధీ గత నెలలో ఢిల్లీ కోర్టుకు తెలియజేశారు. వైఐలో సోనియాగాంధీ, రాహుల్ ప్రధాని వాటాదారులుగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నేత ఆస్కార్ ఆస్కార్‌ ఫెర్నాండెజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.

కాగా, ఈ కేసుకు సంబంధించి మీడియా కవరేజ్ నిలువరించేలా ఆదేశాలివ్వాలంటూ గతంలో కోరిన రాహుల్ విజ్ఞప్తిని కూడా కోర్టు తోసిపుచ్చింది. యంగ్ ఇండియాలో డైరెక్టర్ పదవి ద్వారా రాహుల్‌కు ఎలాంటి ఆదాయం లేదని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి అప్పట్లో వివరించారు. అయితే షేర్ల ద్వారా రాహుల్‌కు గతంలో అంచనా వేసిన ప్రకారం రూ.68 లక్షలు కాకుండా రూ.154 కోట్లు వచ్చాయని, 2012 నుంచి కంపెనీ డైరెక్టర్‌గా ఆయన ఉన్నారని ఆదాయం పన్ను శాఖ వాదిస్తోంది.

నేషనల్ హెరాల్డ్‌ల పత్రిక నిధుల దుర్వినియోగంపై  బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.  ఈ కేసులో సోనియా, రాహుల్‌లు ఐటీ విచారణ ఎదుర్కొన్నారు.

2012లో దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా నేషనల్‌ హెరాల్డ్‌ స్కాం వెలుగులోకి వచ్చింది. సంచలనం రేపిన ఈ స్కాంలో సోనియా, రాహల్‌తోపాటు మరో నలుగురు కాంగ్రెస్‌ కీలక నేతలు మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, సుమన్‌ దూబె, శామ్‌ పిట్రోడాలపై కూడా విచారణ కొనసాగుతోంది.