కుమారస్వామి ప్రభుత్వానికి గురువారం బలపరీక్ష

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభానికి జులై 18తో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జులై 18న విధాన సభలో బల పరీక్ష ఎదుర్కోబోతోంది. ఈ బలపరీక్షలో నెగ్గితే సంకీర్ణానికి ప్రస్తుతం ముప్పు తప్పినట్టే అవుతుంది.  ఇందుకు స్పీకర్‌ రమేశ్ కుమార్‌ అధికార పక్షానికి కొంత సమయం ఇచ్చారు. ఈ నెల 18న (గురువారం) ఉదయం 11 గంటలకు విధానసభలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై రాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని, శాసనసభలో విశ్వాసపరీక్షకు సిద్ధంగా ఉన్నానని గత శుక్రవారం సీఎం కుమారస్వామి స్వయంగా ప్రకటించడంతో కర్ణాటక రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇదిలా ఉండగా.. స్వయంగా కుమారస్వామే బలపరీక్షను ఎదుర్కొంటానని చెప్పడంతో  సోమవారమే విశ్వాస పరీక్ష పెట్టాలని బిజెపి పట్టుబట్టింది. అయితే ఇందుకు స్పీకర్‌ నిరాకరించారు. 

ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం సుప్రీం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆ తర్వాతే బలపరీక్ష పెడతామని, అందుకు అధికార పక్షం సిద్ధంగా ఉండాలని స్పీకర్‌ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. స్పీకర్‌ నిర్ణయం పట్ల బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు కంటే ముందే బలపరీక్ష పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు చేతబట్టి శాసనసభలో నిరసన తెలిపారు. 

దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు. అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధ రామయ్య మాట్లాడుతూ గురువారం తమ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోనుందని చెప్పారు.

కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలు ఆమోదించాలని సుప్రీంకోర్టు రేపు తీర్పు వెల్లడిస్తే.. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కి తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్‌ 105 అవుతుంది. శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 107 (ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి). రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణ ప్రభుత్వ సంఖ్యా బలం 101 (స్పీకర్‌తో కలిపి). ఇలాంటి సమయంలో విశ్వాస పరీక్షలో కుమారస్వామి నెగ్గడం దాదాపు అసాధ్యంగానే కన్పిస్తోంది.