బిజెపితో విభేదించడంతో కుంటుపడింది ఏపీ అభివృద్ధి

టిడిపి పాలనలో అవినీతి జరిగిందో లేదో తెలీదుగానీ పాలనమాత్రం పూర్తిగా గాడి తప్పిందని, బిజెపితో విభేదించిన తర్వాత రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు యలమంచిలి సుజనా చౌదరి తెలిపారు. . బిజెపిలో చేరిన తరువాత మొదటిసారిగా రాష్ట్రానికి వచ్చిన ఆయన విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం జరిగిన బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ 2014లో టిడిపి-బిజెపి కలయికలో ప్రధాన పాత్ర వహించాని చెప్పారు. 

ఇప్పటివరకూ అధికారంలోకి వచ్చిన ఏ కేంద్ర ప్రభుత్వమూ చేయని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ నిధులిచ్చారని కొనియాడారు. ఇప్పటివరకూ పరోక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ బిజెపిలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో బిజెపి పాలన సాగిస్తుందని, దీనికి తామంతా కృషి చేస్తామని పేర్కొన్నారు. 

అనంతరం ఎంజి రోడ్డులోని హోటల్‌ ఫార్చ్యూన్‌ మురళీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుజనాచౌదరి మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యయమని, ఇప్పట్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వలేదని, నిబంధనల ప్రకారం సాధ్యపడదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు లేక జగన్‌లలో ఎవరు ప్రధానమంత్రి సీటులో కూర్చున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం అసాధ్యమని తెలిపారు. 

కేంద్రం ఇస్తానన్న ప్యాకేజీ వదులుకుని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక పోయిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమైనా ప్యాకేజీ తీసుకుంటే రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందని సూచించారు.  

రాజ్యాంగబద్ధంగానే తాను టిడిపి వీడి బిజెపిలో చేరారని చెప్పారు. బిజెపిలో చేరడానికి చంద్రబాబు సహకరించారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మోడీ కేబినెట్‌లో తాను మంత్రిగా పనిచేశానని, ఆయన పనితీరు నచ్చే బిజెపిలో చేరానని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని పేర్కొన్నారు. `ఏపీలో నాయకుల వలసలను ప్రోత్సహించడం మా ఉద్దేశ్యం కాదు. బీజేపీని సొంతంగా బలోపేతం చేసుకోవడమే లక్ష్యం’ అని తెలిపారు.