బిజెపి ప్రధాన కార్యదర్శి గా బిఎల్ సంతోష్

బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగతం)గా కర్ణాటకకు చెందిన బీఎల్‌ సంతోష్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు సంయుక్త ప్రధానకార్యదర్శి (సంస్థాగతం)గా ఉన్న ఆయనకు పదోన్నతి కల్పిస్తూ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నిర్ణయం తీసుకున్నారు. సంతోష్ తక్షణమే నూతన బాధ్యతల్ని చేపడతారని బిజెపి ఒక ప్రకటనలో తెలిపిం ది. 

13 ఏళ్లుగా ప్రధానకార్యదర్శిగా ఉన్న రాంలాల్‌.. తిరిగి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు వెళ్లడంతో ఆ పదవిలో సంతోష్‌ను నియమించారు. రాంలాల్‌ను అఖిల భారతీయ సహసంపర్క్‌ ప్రముఖ్‌.. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రజాసంబంధాల కో కన్వీనర్‌గా నియమించారు. 

ఇంజినీర్‌ అయిన సంతోష్‌ 1993 జూన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా చేరారు. కర్ణాటకకు చెందిన ఆయన  పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడని పేరుంది. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా ఉన్న సంతోష్ 2006 నుంచీ బిజెపికి పనిచేస్తున్నారు. కర్ణాటక బిజెపి ప్రధాన కార్యదర్శిగా ఎనిమిదేళ్లు పనిచేశారు. 

సిద్ధాంతకర్తగా పేరున్న సంతోష్ అదే స్థాయిలో ఎన్నికల్లో రాటుదేలిన వ్యూహకర్తగాను పేరుంది.  పార్టీలో అధ్యక్షుడి తర్వాత రెండో అత్యున్నత పదవిగా భావించే జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగతం) పదవికి నియమితులయ్యారు. బిజెపి ప్రధానకార్యదర్శిగా బీఎల్‌ సంతోష్‌ దక్షిణాదిలో పార్టీ విస్తరణపై దృష్టి సారించగలరని భావిస్తున్నారు.