కర్ణాటక సంకీర్ణానికి డేంజర్ బెల్స్

అసంతృప్త ఎమ్మెల్యే టిబి నాగరాజును బుజ్జగించేందుకు కర్నాటక సంకీర్ణ నేతలు చేసిన యత్నాలు విఫలం అయ్యాయి. దీనితో కర్నాటకలోని జెడిఎస్‌ కాంగ్రెస్ సంకీర్ణ సర్కారుకు గడ్డు పరిస్థితి మరింత జటిలం అయింది. తాను రాజీనామాకు కట్టుబడి ఉంటానని, ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని నాగరాజు ఆదివారం స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయన ముంబైలోని రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌లో చేరేందుకు బయలుదేరి వెళ్లారు.

13నెలల కుమారస్వామి ప్రభుత్వాన్ని రక్షించేందుకు మనసు మార్చుకోవాలని పలుదఫాలుగా సంకీర్ణ ప్రభుత్వ అగ్రనేతలు యత్నించారు. అయితే నాగరాజు ఇందుకు ససేమిరా అన్నారు. రాజీనామా ఉపసంహరించుకునేది లేదని, దీనిపై స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. దీనితో బెంగళూరులోని సంకీర్ణ నేతల్లో గుబులు రెట్టింపు అయింది. 

బిజెపి సీనియర్ నేత ఆర్ అశోక్ తనతో పాటు విమానంలో వచ్చాడనే వార్తలను నాగరాజు ఖండించారు. బిజెపి ప్రోద్బలంతోనే రాజీనామాలు చేస్తున్నారనే వాదనను ఖండించారు. సుధాకర్ రాజీనామాపై పట్టుతో ఉన్నారని, ఆయన బాటలోనే తానూ వెళ్లుతానని తేల్చిచెప్పారు.

అయితే ముంబైలోని అసంతృప్త ఎమ్మెల్యేలకు నచ్చచెప్పి వారిని తిరిగి స్వరాష్ట్రం రప్పిస్తారని, నాగరాజుపై తమకు నమ్మకం ఉందని అంతకు ముందు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మె ల్యే హెచ్‌కె పాటిల్ బెంగళూరులో విశ్వాసం వ్యక్తం చేశా రు. అయితే ఆయన ఆశలు అడియాసలు అయ్యాయి. ముంబైలో క్యాంప్‌లో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలపై పట్టుదలతోనే ఉన్నట్లు వెల్లడైంది. 12 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ముంబై క్యాంపులో ఉన్నారు.

సంకీర్ణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మైనార్టీలో పడిందని బిజెపి నేత యడ్యూరప్ప చెప్పారు. ముఖ్యమంత్రి కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలి. లేదా బలపరీక్షకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. బలం లేదని తెలుస్తోంది. కాబట్టి రాజీనామా చేయాలి. బలముందని అనుకుంటే, నిరూపించుకునేందుకు సోమవారం (నేడే) అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు దిగాలని యడ్యూరప్ప స్పష్టం చేశారు. 

కుమారస్వామి నిజాయితీపరుడు అయితే, ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల నిబద్ధత ఉన్నవాడైతే ఈ రెండింట్లో ఏదో ఒకటి చేయాల్సి ఉందని చెప్పారు. 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఇద్దరు ఇండిపెండెంట్లు ప్రభుత్వానికి మద్దతు వెనకకు తీసుకున్నారు. మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. ఇక ప్రభుత్వానికి బలం ఏముందని ఆయన ప్రశ్నించారు.