ఏపీలో టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధం

ఏపీలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని, టీడీపీ కూడా ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జాతీయ రాజకీయా

లలో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు కోలుకోలేని దెబ్బ తిన్నారని, మోదీని తిట్టడమే తప్ప, తాను చేసిన అభివృద్ధి ఏమిటో బాబు చెప్పలేకపోయారని విమర్శించారు. 

చంద్రబాబు అధికారంలో ఉండగా, ప్రత్యేక హోదా వద్దన్నారని, ప్యాకేజీకే అంగీకరించారని గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే కేంద్రం కూడా అనేక రూపాల్లో నిధులను ఇచ్చిందని చెప్పారు. అయితే దానిని అప్పటి సీఎం చంద్రబాబు దారి మళ్లించి, జేబులో వేసుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఏపీలో కూడా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని, బీజేపీ మాత్రం వాటిని ఎంతమాత్రమూ ప్రోత్సహించదని ఆయన తేల్చి చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ పారిపోయారని, కెప్టెన్ అనేవాడు ఎన్ని కష్టాలు ఎదురైనా, ముందుండి నడపాలి కానీ, రాహల్ మధ్యలోనే పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అనేక రాష్ట్రాల్లో జీరో స్థాయిలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఏపీలో కూడా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. 

రాష్ట్రంలో 25 లక్షల నూతన సభ్యులను చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన ప్రకటించారు. సబ్‌కా సాథ్... సబ్‌కా వికాస్ అనేదే బీజేపీ నినాదమని, 2025 నాటికి ఏపీలో అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సేవ చేయాలనుకునే వారికి పార్టీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా రావొచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.