తానా సభలలో మాత్రమే టిడిపి మిగులుతుంది

టీడీపీ కేవలం తానా సభలలో మాత్రమే మిగులుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  భయంకరమైన అవినీతితో ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని స్పష్టం చేశారు. నేరాలకు నిలయంగా టీడీపీ మారిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... పెనం నుంచి పొయ్యిలో పడేందుకు కూడా టీడీపీకి అవకాశం కూడా ఇవ్వరాదని హెచ్చరించారు.

కాంగ్రెస్ లేకుండా చేసే బాధ్యత రాహుల్ గాంధీ చూసుకుంటారని, గతంలో గాంధీ కాంగ్రెస్‌ని మూసేయాలని చూస్తే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పనిని పూర్తి చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2024 నాటికి ఏపీలో అధికార పార్టీ దిశగా బీజేపీ ఎదగాలని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఏపీలోని అత్యధిక ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించేట్లు చూడాలని, దేశం మొత్తం మీద వచ్చిన ఆదరణను ప్రేరణగా తీసుకొని ఏపీలో బలపడాలని రాష్ట్ర నాయకత్వానికి ఆయన సూచించారు.

పార్టీ అధిష్ఠానం ఆశించినంత మేర ఏపీలో ఓట్లు రాలేదని, అందుకే బలపడేందుకు ప్రతీ కార్యకర్తా ఛాలెంజింగ్‌గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీలో అధికార టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న నమ్మకం ప్రజల్లో బలపడిందని చెప్పారు. తెలంగాణకు దీటుగా ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీని నిర్మించుకోవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని రాం మాధవ్‌ తెలిపారు.  

అధికారమే పరమావధిగా పనిచేసే పార్టీ బీజేపీ కాదని, ప్రజలకు సేవ చేయడమే పార్టీ అంతిమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. బీజేపీలో గ్రూపుల రాజకీయం, ధన రాజకీయం, కుల రాజకీయం అస్సలుండవని, వీటన్నింటికీ అతీతంగా బీజేపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చే నాయకులు ఈ అంశాలను గమనించాలని ఆయన సున్నితంగా హెచ్చరించారు. 

ఐదు వారాల వ్యవధిలో రాష్ట్ర నాయకత్వం కొత్త సభ్యుల చేరికను చేపట్టాలని, ఒక్కో కార్యకర్త స్వయంగా 25 మంది కొత్త సభ్యులకు సభ్యత్వం ఇప్పించాలని, అలా చేయని వారు ఏ పదవీ ఆశించడానికి అర్హతే లేదని రామ్ మాధవ్ స్పష్టం చేశారు.