వరద పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి

భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితిని ఎదుర్కొంటున్న అన్ని రాష్ట్రాలకు తక్షణ ప్రాతిపదికన సహాయ సహకారాలు అందించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు అన్ని ఏజెన్సీలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ఆదేశించారు. ఉన్నతాధికారులతో ఆయన వరద, వర్ష పరిస్థితులను సమీక్షించారు. ఎ లాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు అందరు అధికారులకు అమిత్ షా స్పష్టం చేసినట్లు హోం మంత్రి సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మీడియాకు వెల్లడించారు.

ఇప్పటి వరకు బీహార్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు వర్షాలు, వరదల కారణంగా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. ఈ రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు అనుసంథానంగా వ్యవహారించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను హోం మంత్రి ఇప్పటికే ఆదేశించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోం మంత్రి స్పష్టం చేసినట్లు నిత్యానంద రాయ్ వెల్లడించారు.

గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉత్తర బెంగాల్ అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో దాదాపుగా వరద పరిస్థితి నెలకొనడంతో జన జీవనం స్తంభించింది. ఆదివారం కూడా మరింత భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించడంతో పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాలతో కొండ చరియలు విరిగి పడడం, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునగడం, అనేక రోడ్లు కనిపించకుండా చెరువుల్లా మారిపోవడంతో ప్రజలు, పర్యాటకులు ఎన్నో అవస్థలు పడుతున్నారు.

ఇలాఉండగా ఆదివారం వరకూ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని సబ్-హిమాలయన్ ప్రాంతానికి చెందిన ఐదు జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భా రీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. డార్జలింగ్, కలీంపొంగ్, జల్‌పైగురి, కూచ్‌బెహర్, అలిపూర్ద్వార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే తీస్తా, డయానా, లిష్, గైహిశ్, రైదాక్, కల్జానీ, సంకో శ్, జల్దాకా చెరువుల నీటి మట్టం పెరిగి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. ఎడతెరిపి కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి.

ఉత్తర బెంగాల్‌లోని సిక్కిం, డోరాస్ ప్రాంతాలు సిల్‌గురి నుంచి సంబంధాలు తెగిపోయాయి. కొండ చరియలు విరిగి పడడంతో సిక్కిం రాష్ట్రం జా తీయ రహదారిపై రాకపోకలు నిలిచి పో యాయి. ఇంకా ఆ రాష్ట్రం బాగా దెబ్బతిని జన జీవనం స్తంభించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్ళను రద్దు చేశామని, మరి కొన్నింటిని మళ్లించామని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.