మండలి నుంచి బిజెపి సభ్యుల వాకౌట్‌

ప్రధాని మోదీపై టిడిపి సభ్యులు పదేపదే విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తూ శాసనమండలి నుంచి బిజెపి సభ్యులు సోము వీర్రాజు, కంచేటి సత్యనారాయణరాజు వాకౌట్‌ చేశారు. ‘అమరావతిలో అభివృద్ధి’ అంశంపై మండలిలో జరిగిన చర్చ సందర్భంగా సోము వీర్రాజు, టిడిపి  సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

 ప్రధాని మోదీ ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లారని, మట్టి తెచ్చి ఏపీ ప్రజల నోట్లో కొట్టారని టిడిపి సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. దీనిపై సోము వీర్రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు. వారి వ్యాఖ్యలకు నిరసనగా తాను మండలి నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించి బిజెపి సభ్యులు బయటకు వెళ్లిపోయారు.

కాగా, రాజధానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించడంలో టీడీపీ ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, మాణిక్య వరప్రసాద్‌ తమ సభ్యుడి చర్యను సమర్ధించుకున్నారు.

ఈ సందర్భంగా మండలి బయట టీడీపీ నేతలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన రూ.32వేల కోట్లను టీడీపీ నేతలు మింగేశారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నప్పుడు పొగుడుతూ తీర్మానాలు చేశారని, విడిపోయాక సభలో మోదీని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.

శాసనమండలి అబద్ధాలకు నిలయంగా మారింద వీర్రాజు ఆరోపించారు. అరిగిపోయిన రికార్డులాగా పదే పదే అమరావతి పేరు చెబుతున్నారని, రాజధానికి 1500కోట్లు ఇస్తే కారిపోతున్న తాత్కాలిక భవనాలను కట్టారని, బీజేపీ సభ్యులు ప్రశ్నిస్తే ముప్పేట దాడి చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. నిర్మాణం చెయ్యని రాజధానికి అసెంబ్లీలో డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుందని అన్నారు.

అమరావతిలో ఎమ్మెల్యేల నివాసాలు నిర్మించామని నిధులు తీసుకున్నారు.. కానీ ఎక్కడ నిర్మించారో తమకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి టీడీపీ సహకరించ లేదా అని సూటిగా ప్రశ్నించారు. విభజన సమయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై టీడీపీ ఎంపీలు ప్రశ్నించారా అని నిలదీశారు. టీడీపీ నీతి, నిజాయితి లేని పార్టీ అని ఆరోపించారు. 

రాజధాని నిర్మాణం చేతకాకుంటే తామే నిర్మించి చూపెడతామని సవాలు విసిరారు. రాజధాని పేరుతో విదేశీ సంస్థలకు భూములు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకు డీపీఆర్‌ ఇవ్వలేదని అన్నారు. సభలో తమ పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్‌ చేస్తున్నట్టు వెల్లడించారు.