బిజెపిలోకి 107 మంది బెంగాల్ ఎమ్మెల్యేలు

పశ్చిమ బెంగాల్‌లోని 107 మంది అధికార తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని పేర్కొంటూ బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  దేశంలో కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని అసంతృప్త నేతలు రాజీనామాలు చేశారు. మరోవైపు గోవాలో ఏకంగా సీఎల్పీని బీజేపీలో విలీనం చేశారు. 

ఇటువంటి సమయంలో ముకుల్ రాయ్ ప్రకటన రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆయన 2017లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్యెల్యేలు, 60 మంది కౌన్సిలర్లు లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనంతరం బెంగాల్ లో బీజేపీలో చేరారు. 

కమలం పార్టీలో చేరేవారిలో అధికార టీఎంసీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, సీపీఎం శాసనసభ్యులు ఉన్నారని రాయ్ వివరించారు. పార్టీలో చేరే వారి జాబితాను తయారు చేశామని, వాళ్లంతా తమతో టచ్‌లోనే ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం సభ్యుల సంఖ్య 294. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి అత్యధికంగా 211 సీట్లు రాగా, బీజేపీకి కేవలం 3 సీట్లే దక్కాయి. కాంగ్రెస్‌ 44సీట్లు సొంతం చేసుకోగా..వామపక్షాలు 32స్థానాల్లో గెలుపొందాయి. ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. దానితో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడంతో పాటు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దింపేందుకు సమరోత్సాహంతో విజృంభిస్తున్నది.