కర్ణాటకలో అధికార కూటమికి చెందిన 16 మంది ఎమ్యెల్యేలు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడిన ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమని శుక్రవారం అసెంబ్లీలో అనూహ్యంగా ప్రకటించిన మరుసటి రోజునే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రదిపాదించడానికి సిద్ధమని ప్రతిపక్ష నేత, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి ఎస్ యడ్డ్యూరప్ప ప్రకటించారు.
సోమవారం నాటి వరకు వేచి చూస్తామని, అప్పుడు అవసరమీయతే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి ప్రకటించిన విశ్వాస తీర్మానం గురించి సోమవారం ప్రతిపక్ష నేతతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ కె ఆర్ రమేష్ కుమార్ ప్రకటించడం తెలిసిందే.
మరోవంక, కర్ణాటక స్పీకర్‌కి వ్యతిరేకంగా మరో ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆనంద్ సింగ్, రోషన్ బేగ్ సహా ఐదుగురు ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తమ రాజీనామాలు ఆమోదంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇప్పటికే 10 మంది రెబల్ కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అప్పటివరకూ రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లో తమను ఇంప్లీడ్ చేసి విచారణ జరపాలని మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ధర్మాసనాన్ని కోరారు. తమ రాజీనామాలు స్పీకర్ ఆమోదించేలా చూడాలని అభ్యర్థించారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. రాజీనామా చేసిన మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి మాత్రమే సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించలేదు.
ఇలాఉండగా, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం కోసం బెంగుళూరుకు చేరుకున్న తిరుగుబాటు ఎంఎంఎల్యేలను దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమ ఐదు గంటలకే కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ ఎమ్యెల్యే నాగరాజ్ ఇంటికి వెళ్లి రాజీనామాను ఉపసంహరించుకోమని కోరారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి సహితం కొందరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తున్నది.