చంద్రబాబు బాటలో జగన్... సొంత పేరుతో పధకాలు

వారిద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు కావచ్చు. వారి పాలనా తీరుతెన్నులు మాత్రం దాదాపు ఒకే విధంగా ఉంటూ వస్తున్నాయి. పరస్పరం అవకాశం వచ్చినప్పుడల్లా తీవ్రమైన విమర్శలకు దిగుతూ ఉన్నప్పటికీ వారి నడవడిలో మౌలికమైన మార్పు కనిపించడం లేదు. వారే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబునాయుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడంలో కూడా వీరిద్దరి ఒకరికి మరొకరు తీసిపోమని నిరూపించుకొంటున్నారు. 

గతంలో చంద్రబాబునాయుడు తన హయంలో పలు పథకాలకు తన పేరును పెట్టుకొనే ఒక అనూహ్య రాజకీయ సంప్రదాయానికి శ్రీకార్మ చుట్టారు. గతంలో మరెవ్వరు అటువంటి ప్రయత్నం చేయలేదు, ఇప్పుడు జగన్ సహితం అదే బాటలో నడుస్తున్నారు.   చంద్రన్న ఇది అంటూ పలు ప్రభుత్వ పథకాలకు  చంద్రబాబు పేర్లు పెట్టడంపై వైసీపీ అప్పట్లో తీవ్ర విమర్శలు చేసింది. 

చంద్రన్న పేరుతో ప్రచారం చేసుకోవటానికి ఇవేమీ ఏమైనా హెరిటేజ్ డబ్బుల నుంచి ఇస్తున్నారా?. లేక చంద్రబాబు తండ్రి  ఖర్జూరనాయుడి తండ్రి ఆస్తుల నుంచి ఇస్తున్నారా? అంటూ వైసీపీ నేతలు తీవ్ర  విమర్శలు చేశారు. 

కానీ ఇప్పుడు జగన్ సీఎం అయిన 45 రోజులకే ఏకంగా ఆయన పేరుతో రెండు పధకాలు వచ్చేసాయి. దాదాపు ఆరు సంతవ్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి లాంటి సీనియర్ నేత కూడా ప్రభుత్వ పథకాలను తన పేరు పెట్టుకునే సాహసం చేయలేదు. 

అవి ఒకటి జగనన్న అమ్మఒడి కాగా.. ఇంకోటి జగనన్న విద్యా దీవెన పథకం.   బడ్జెట్‌లో ఈ రెండు పథకాల పేర్లను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తావించారు. 

ఇక పలు పథకాలకు టిడిపి వ్యవస్థాపకుడు, తన మామగారైన ఎన్టీఆర్ పేరును చంద్రబాబు పెడితే, ఇప్పుడు జగన్ తన తండ్రి వైఎస్ పేరును వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ బీమా, వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణాలు అంటూ 29  పథకాలకు పెడుతున్నారు. 

జన్మభూమి కమిటీల పేరుతో టిడిపి కార్యకర్తలను చంద్రబాబు నియమించి, స్థానికంగా విచ్చలవిడి అవినీతికి అవకాశం కల్పిస్తే, ఇప్పుడు  గ్రామ వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను అదే బాటలో నియమించుకొంటూ జగన్ విమర్శలకు గురవుతున్నారు.