పొగాకు బోర్డు చైర్మన్‌గా యడ్లపాటి

భారత పొగాకు బోర్డు చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన బిజెపి సీనియర్‌ నాయకులు యడ్లపాటి రఘునాథబాబును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1975 గుంటూరులో ఏర్పాటు చేసిన పొగాకు బోర్డు గత 44 ఏళ్లుగా వర్జీనియా పొగాకు ఉత్పత్తిదారులకు తన సేవలందిస్తోంది. అప్పటి నుంచి ఈ బోర్డుకు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు చైర్మన్‌గా ఉంటూ వచ్చారు. 

రాష్ట్రానికి చెందిన లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ ఐఎఎస్‌ను చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించడం అనవాయితీగా వస్తోంది. 

రైతులకు, వ్యాపారులకు మధ్య బోర్డు సంధానకర్తగా ఉంటూ ధరలు పడిపోయినప్పుడు కనీస హామీ ధరకు పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటుంది. దేశీయ అవసరాల కోసం ఉపయోగించే పొగాకు మినహా మిగతా పొగాకు ఎగుమతి చేస్తుంటారు. తద్వారా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోంది. 

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొగాకు బోర్డు చట్టానికి సవరణలు చేశారు. చైర్మన్‌గా ఐఎఎస్‌ అధికారి స్థానంలో నాన్‌ అఫీషియల్‌ను చైర్మన్‌గా నిర్ణయిస్తూ మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో యడ్లపాటి రఘునాథబాబును నియమించారు.   

గత మూడు దశాబ్దాలుగా బీజేపీలో పలు పదవులలో కొనసాగిన రఘునాధబాబు ఏపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో కూడా పోటీ చేశారు.