‘ఆపరేషన్ గరుడ’పై టిడిపిలో అంత బెదురెందుకు!

ఎన్డియే నుండి బైటకు వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో అబధ్రతాభావం ఎక్కువగా కనిపిస్తున్నది. మాట్లాడితే తన వెనుకు ఏదో కుట్ర జరుగుతున్నదని, తన ప్రభుత్వాన్ని అస్తిరపరచే ప్రయత్నం జరుగుతున్నదని, తమపై సిబిఐ కేసులు నమోదు చేయబోతున్నారని అంటూ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ దిశలో ఏమీ జరగడం లేదు.

మొదట్లో కర్ణాటక ఎన్నికలు కాగానే ఆంధ్రప్రదేశ్ లో పలువురిపై కేసులు తధ్యం అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి తన బద్రతపై ఒక బహిరంగసభలో అనుమానం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు టిడిపి నాయకులు కుడా సిని నటుడు శివాజీ `సృష్టించిన’ `ఆపరేషన్ గరుడ’ను ప్రస్తావిస్తున్నారు. దాని గురించి ఆయన ఎన్నెన్నో కధలు అల్లి ప్రచారంలోకి తీసుకు వచ్చారు.

వాస్తవానికి రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడిపై చంద్రబాబు కన్నా ఉధృతంగా, ఎక్కువగా పోరాటం చేస్తున్న నాయకులు దేశంలో అనేకమంది ఉన్నారు. కాని వారెవ్వరిలో ఇటువంటి అబద్రతాభావం వ్యక్తం కావడం లేదు. గత నాలుగేళ్ళలో ఏమే జరుగకుండా అక్రమంగా ఎవ్వరిపైన కుడా ఒక్క సిబిఐ కేసు నమోదు చేసిన్నట్లు ఎవ్వరు ఆరోపణలు చేయనే చేయలేదు. గత ప్రభుత్వం అటకేక్కించిన కేసులను బూజు దులిపి బయటకు తీయడమే జరిగింది. ఎందుకు చంద్రబాబుకు అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ?

మాట్లాడితే తాను నిప్పు అని అంటారు. తనపై ఎవ్వరు అవినీతి ఆరోపణలు చేయలేదని అంటారు. తాను తప్పే చేయనని చెబుతారు. మరెందుకు భయం ? `ఆపరేషన్ గరుడ’ నిగ్గు తేల్చమని స్వయంగా బిజెపికి చెందిన ప్రజాప్రతినిధులు చాల నెలల క్రితమే డిజిపిని స్వయంగా కలసి కోరారు. దానిపై విచారణ జరిపించమని కోరారు. కాని ఆ దిశలో రాష్ట్ర పోలీస్ ఒక్కడుగు కుడా ముందుకు వేయలేదు.

దేశ్యంలో అత్యంత ఎక్కువగా బద్రత ఉన్న నాయకులలో చంద్రబాబు ఒకరు. ఆయనకన్నా ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వై ఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారికన్నా కుడా ప్రతిపక్ష నేతగా ఆయనకే ఎక్కువగా బద్రత ఉండెడిది. టిడిపికి మిత్రపక్షంగా బిజెపి ఉన్నంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆయనను కాపాడుకొంటూ వచ్చింది. ఇప్పుడా అవసరం రాజకీయంగా లేదు. సహజంగానే తెలుగు రాష్త్రాలలో కుడా తమ ప్రభుత్వం రావాలని బిజెపి కోరుకొంటుంది. అందుకు ప్రజల మద్దతు ద్వారా ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలను కొంటుంది గాని మరో విధంగా కాదు గదా!

దేశంలో ఇప్పుడు 19 రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయి. అన్ని చోట్ల ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది గాని మరోవిధంగా కాదు గదా ! ఎందుకు చంద్రబాబు అంతగా భయపడుతున్నారు ? నిజంగా అయన బధ్రతకు ముప్పు ఉంటె, అందుకు ‘ఆపరేషన్ గరుడ’ను ప్రయోగిస్తే రాష్ట్ర ప్రభుత్వపు నిఘా విభాగం ఏమి చేస్తున్నది ? శివాజీ వంటి ఒక వ్యక్తి తరచూ హెచ్చరికలు చేయవలసిన ఖర్మ ఆయనకు ఎందుకు పట్టింది ?

తన బాధ్రతకు ముప్పని అనుకొంటే టిడిపి ఎంపీలను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వద్దకు పంపి ఆయన దృష్టికి సమస్యను తీసుకు రావచ్చు గదా ? మీడియాలో కధనాలు వ్యాప్తి చేయడం ద్వారా బద్రత ఏర్పడుతుందా ? ఒక ముఖ్యమంత్రిగా, సీనియర్ రాజకీయ నేతగా తన బద్రత గురించి మీడియాలో అపోహాలు సృష్టిస్తే ఎవ్వరికీ నష్టం ?

త్వరలో కేంద్ర సంస్థలు చంద్రబాబుకు నోటిసులు ఇస్తారని చెప్పిన శివాజీ ఎందుకు ఇవ్వాలి అనుకొంటున్నారో కూడా చెప్పవచ్చు గదా ? ప్రభుత్వమే శివాజీ ద్వారా ఇటువంటి అపోహలను ప్రజలలో వ్యాప్తి చేస్తున్నదా ? ప్రభుత్వ నిఘా విభాగాల సమాచారాన్ని ఆయన ద్వారా బయటకు పోక్కిస్తున్నదా ? తన వైఫల్యాల నుండి ప్రజల ద్రుష్టి మళ్ళించడం కోసం తనను కేంద్రం విధించబోతున్నదంటూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారా ?

“ఆపరేషన్‌ గరుడ అనేది అవాస్తవం. శివాజీతో టీడీపీ నేతలే ఇలా మాట్లాడిస్తున్నారు. ఆపరేషన్‌ గరుడపై విచారణ జరపాలని డీజీపీని ఏపీ బీజేపీ నేతలు కోరారు. ఆపరేషన్‌ గరుడ నిజమైతే నిందితులపై చర్యలు తీసుకోవాలి. ఒక వేళ అది అవాస్తవమైతే శివాజీపై చర్యలు తీసుకోవాలని కోరాము" అని మాజీ మంత్రి, బిజెపి ఎమ్యెల్యే పి మాణిక్యాలరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరోవంక బిజెపి రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ఈ విషయమై నేరుగా ముఖ్యమంత్రికే ఒక లేఖ వ్రాసారు. ఈ ఆరోపణలే నిజమైతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థ కుప్పకూలిన్నట్లు భావించవలసి వస్తుందని, దానితో ముఖ్యమంత్రి సహితం శివాజీ వంటి ఒక సామాన్య వ్యక్తి అందించే సమాచారంపై ఆధార పడుతున్నట్లు భావించవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసారు. ఇటువంటి పరిస్థితి చాల తీవ్రమైన అంశమని హెచ్చరించారు. అందుకు బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

శివాజీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు అని స్పష్టం చేస్తూ సమాజంలో అపోహాలు, ఉద్రిక్తలు కలిగించే విధంగా ఉండే అటువంటి ఆరోపణలు చేస్తున్న ఆయనపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.