బలపరీక్షకు కుమారస్వామి సిద్ధం

కర్నాటకలో రాజకీయ సంక్షోభం చుట్టిముట్టిన సమయంలో ముఖ్యమంత్రి కుమారస్వామి అనూహ్యంగా బలపరీక్షకు సిద్ధపడుతున్నట్లు ప్రకటించారు. తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి సిద్ధమని అసెంబ్లీలో ప్రకటించారు. స్పీకర్‌ సమయం ఎప్పుడు కేటాయిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

కొంద‌రు ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల‌.. రాష్ట్ర రాజ‌కీయాలు అనేక మ‌లుపులు తిరుగుతున్నాయ‌ని చెబుతూ అందుకే విశ్వాస ప‌రీక్ష కోసం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు సీఎం తెలిపారు. తిరిగి వచ్చే మంగళవారం కేసు విచారణను చేపట్టేవరకు యధాతథస్థితిని కొనసాగించాలని స్పీకర్ కె ఆర్ రమేష్ కుమార్ ను  సుప్రీం కోర్ట్ ఆదేశించిన కొద్దీ సేపటికే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.

రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారిని మినహాయిస్తే మొత్తం 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో సంకీర్ణ ఎమ్మెల్యేల సంఖ్య రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే 100కు పడిపోవడం, బీజేపీ సభ్యుల సంఖ్య 107 కావడంతో బలపరీక్షను కోరడం వెనుక కుమారస్వామి వ్యూహం ఏమిటో అంతుచిక్కడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు.