రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యధాతథ స్థితి

కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృత రాజ్యాంగ అంశాలపై స్పష్టత వచ్చేవరకు తుది నిర్ణయం తీసుకోరాదంటూ స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది.

తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ అటు అసమ్మతి ఎమ్మెల్యేలు... తనకు మరింత సమయం కావాలంటూ ఇటు స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

ఈ కేసు రాజ్యాంగంలోని 190, 361 అధికరణలతో ముడిపడి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే ముందు వారి అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చా అన్నది నిర్ణయించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.

తొలుత అసమ్మతి ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. రాజీనామాలను స్పీకర్‌ కావాలనే ఆమోదించడం లేదని, ఈ అంశాన్ని పెండింగ్‌లో ఉంచి వారిపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని రోహత్గీ ఆరోపించారు. స్పీకర్‌ వ్యవహారం రెండు గుర్రాలపై సవారీలా ఉందని విమర్శించారు. ఒకవేళ రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు గడువు కల్పిస్తే.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా చూడాలని రోహత్గీ న్యాయస్థానాన్ని కోరారు. ఒకవేళ అప్పటికీ రాజీనామాలను ఆమోదించకపోతే స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులివ్వాలని విన్నవించారు.

కోర్టు తీర్పును సవాల్‌ చేసే అధికారం స్పీకర్‌కు ఉందా అని రమేశ్‌ కుమార్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి ప్రశ్నించారు. ఇందుకు ఆయన లేదని సమాధానమిచ్చారు. అయితే నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోమని ఆదేశించడం సరికాదని సింఘ్వీ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వెనుక ఉద్దేశం వేరని, అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే వారు పదవుల నుంచి తప్పుకున్నారని సింఘ్వీ తెలిపారు. అందుకే రాజీనామాల కంటే ముందు రెబల్స్‌పై అనర్హత వేటు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.