బిజెపిలో చేరిన టిడిపి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్

తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బీజేపీలో చేరారు. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి ఇప్పటికే రాజీనామా చేసిన ఆయన . ఇవాళ ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. జేపీ నడ్డా ఈ సందర్భంగా సతీష్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

2014లో బాపట్ల టీడీపీ అభ్యర్థిగా సతీష్ పోటీచేసి ఓడిపోయినప్పటికీ అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఆయన 2019లోనూ పోటీచేసి ఓటమిపాలయ్యారు. పార్టీ క్రియాశీలక సభ్యునిగా ఉన్న సతీష్.. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి టీడీపీ శ్రేణులకు దూరంగా ఉంటూ వచ్చారు.

కాగా, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిందని, వాటిలో బంధు ప్రీతి, కులాభిమానం పెరిగిందని, అందుకే తాను జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరానని గతవారం బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తెలిపారు. ప్రధాని మోదీ దేశ, విదేశాల్లో మంచి పేరు సంపాదించారు. నేను వాజపేయి హయాంలోనే బీజేపీలో చేరాలనుకున్నానని చెప్పారు. మోదీ, అమిత్ షా‌ల పిలుపు మేరకు తాను బీజేపీలో చేరానని చెబుతూ  రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

దేశం మోదీ చేతుల్లో చాలా భద్రంగా ఉందని, బీజేపీ మొదటి నుంచి నిస్వార్ధంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. తనకు వయసు సహకరిస్తుందా..? అని కొందరు అడుగుతున్నారని చెబుతూ రాజకీయాలలో వయసుతో పనిలేదని, మనసు ఉత్సాహంగా ఉండాలని తెలిపారు. ధర్మరాజు 80ఏళ్ల వయసులో యుద్ధం చేశారని గుర్తు చేస్తూ తాను ఇరు రాష్ట్రాలలో ఎక్కడైనా ప్రచారం చేయడానికి రెడీగా వున్నానని చెప్పారు.