బీజేపీలో చేరిన గోవా కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

గోవాలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేసిన 10 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు గురువారం బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సారథ్యంలో ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. తర్వాత బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఇతర సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ తన క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి.

అమిత్‌షా, నడ్డాలతో జరిగిన భేటీలో సావంత్ మాట్లాడిన అంశాలు బయటకు రాకున్నా 10 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల్లో కొందరికి ఆయన క్యాబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు తన ప్రభుత్వ మనుగడకు మద్దతునిచ్చిన మిత్రపక్షాల సభ్యులను తప్పించి, కాంగ్రెస్ రెబల్స్‌కు సావంత్ చోటు కల్పిస్తారని తెలుస్తున్నది.

40 స్థానాల గోవా అసెంబ్లీలో బీజేపీ బలం 27కు చేరుకోవడంతో మిత్రపక్షాలు, స్వతంత్రుల మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై ఆ పార్టీకి లేదు. గోవా గవర్నర్ మృదులా సిన్హా రాష్ర్టానికి వచ్చాక సీఎం తన క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది.

మరోవైపు తమను బీజేపీలో విలీనం చేయాలని 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో బీజేపీ బలం పెరిగిందని సీఎం సావంత్ ఇచ్చిన లేఖలను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ రాజేశ్ పట్నేకర్ చెప్పారు.