కోదండరాం పార్టీపై మహిళా నేత సంచలన ఆరోపణలు

ప్రొఫెసర్‌ కోదండరాం ప్రారంభించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్‌)పై ఆ పార్టీ మహిళా నేత జోత్స్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారని, పార్టీలోని ఒకరు ఈ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటిస్తూ టీజేఎస్‌ బిజినెస్‌ సెంటర్‌గా మారిపోయిందని దయ్యబట్టారు. ఇది కోదండరాంకు తెలుసో, తెలియదో అంటూ సందేహం వ్యక్తం చేసారు.

అంబర్‌పేట నియోజవర్గంలో పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నానని చెబుతూ ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని అధ్యక్షులకు తెలియజేస్తున్నామని తెలిపారు.  తాను టిక్కెట్ల కోసం పార్టీ నుంచి బయటకు రాలేదని స్పష్టం చేశారు. ఏ సిద్ధాంతాల కోసం పార్టీ పెట్టారో, ఆ సిద్ధాంతాలకోసం పని చేయడం లేదని జ్యోత్స్న ఆరోపించారు

పార్టీలో వసూల్‌ రాజాలు ఎక్కువ మందే ఉన్నారని చెబుతూ ఈ విషయాన్నీ పార్టీ నాయకత్వానికి చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు.  చులకన భావంతో తనపై దాడిచేస్తున్నారని, ఒక వ్యక్తిని తనపై దాడికి దింపుతున్నారని ఆరోపించారు.  మరో వ్యక్తి తనకు, తన భర్తకు ఫోన్‌ చేసి చంపుతామని బెదిరిస్తున్నారని విమర్శించారు.

ఏదైనా అడిగితే ఏమిస్తారని, కారు, బంగ్లా ఇస్తారా? అని ఎదరు ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. అంబర్‌పేట్‌ టికెట్‌ ఇవ్వనందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నానని తనపై అసత్య ప్రచారం చేస్తూ పేపర్లలో రాయించారని ఆరోపించారు. కోదండరాం లక్ష్యాల దిశగా పార్టీ నడవట్లేదని, మనీ మిషన్‌గా నడుస్తుందని పేర్కొన్నారు.