అసమ్మతి ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరుకండి

కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోపు ఎమ్మెల్యేలందరూ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఎదుట హాజరు కావాలని  ఆదేశించింది. ఈ ఉదయం 11 గంటలకు పిటిషన్‌ విచారణకు వచ్చింది. స్పీకర్‌ ముందు హాజరై రాజీనామా విషయాన్ని ఆయనతో చర్చించాలని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై రేపటిలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలందరూ బెంగళూరుకు చేరుకునేందుకు తగినంత భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీకి సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.  కావాలనుకుంటే మళ్లీ రాజీనామాలు సమర్పించవచ్చునని సూచించింది.

కర్నాటక స్పీకర్ రమేశ్ కుమార్‌కు కూడా సుప్రీం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రంలోగా ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా తాము స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశామనీ... తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించక పోవడం, తాత్సారం చేయడం వెనుక సాంకేతికంగా తమకు ఎలాంటి కారణం కనిపించడం లేదని ఆయన ధర్మాసనానికి నివేదించారు.