గోవాలో 10మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బీజేపీలో విలీనం

కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం గోవా కాంగ్రెస్ కు వ్యాపించింది.  మొత్తం 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో పది మంది ఎమ్మెల్యేలు తాము బిజెపిలో కలుస్తామని ప్రకటించారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్‌తో కూడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం బుధవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేశ్ పట్నేకర్‌ను సాయంత్రం కలుసుకుంది. స్పీకర్‌కు ఒక లేఖ అందించింది. తాము కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు, తాము అత్యధిక సంఖ్యలో ఉన్నందున చీలిక వర్గంగా తాము బిజెపిలో విలీనం అయ్యేందుకు వీలు కల్పించాలని ఈ లేఖలో తెలిపారు. 

మూడింట రెండొంతుల బలం ఉండటంతో తమను బిజెపిలో విలీనం చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ వద్దకు వచ్చిన దశలో ఆ కార్యాలయంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో కూడా ఉన్నారు.స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేలలో అతనసియో మోంసోర్రెటీ, జెనీఫెర్ మోంసోర్రెటీ, ఫ్రాన్సిస్ సిల్వేరియా, ఫిలిప్ నెరీ రోడ్రిగ్యుస్ ఇతరులు ఉన్నారు. 

ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఇప్పుడు గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఐదుకు చేరుతుంది. కర్నాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు గోవా రిస్టార్‌లలో కొలువు తీరి ఉండగా, కర్నాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతున్న దశలోనే గోవా కాంగ్రెస్‌లో సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. గోవా అసెంబ్లీలో బిజెపి 17 స్థానాలతో అత్యధిక బలమున్న పార్టీగా ఉంది. 

గోవా ఫార్వర్డ్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. ఇక ఎన్‌సిపి, ఎంజిపిల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. పార్టీ మారడానికి కారణాల గురించి తరువాత సమగ్ర ప్రకటన వెలువరిస్తామని తెలిపారు.

సీనియర్ నేత మనోహర్ పారికర్ మృతితో ప్రమోద్ సావంత్ ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి అయ్యారు. చీలిక వర్గం అభ్యర్థన పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందిస్తే గోవా అసెంబ్లీలో బిజెపిబలం మరింత పెరుగుతుంది. సావంత్ ప్రభుత్వం రాజకీయ ప్రమాద సూచీకలకు దూరం అవుతుంది. రెండేళ్ల క్రితం గోవా అసెంబ్లీలో అతి ఎక్కువ స్థానాలను గెల్చుకున్న కాంగ్రెస్ తరువాతి పరిణామాలలో సంఖ్యాబలం పోగొట్టుకుంటూ చివరికి ఇప్పుడు ఐదు స్థానాలకు చేరే పరిస్థితి ఏర్పడింది.  

కాంగ్రెస్‌ చీలిక వర్గం చేరికతో బిజెపి బలం 27కు పెరగనుంది. బీజేపీ సొంత బలం పెరగడంతో మిత్రపక్షమైన గోవా ఫార్వర్డ్‌ పార్టీని ప్రభుత్వంలో కొనసాగించేదీ లేనిదీ అనుమానాస్పదంగా ఉంది.