ఆర్టికల్ 370 రాజ్యాంగంలో తాత్కాలికమే

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రాజ్యాంగంలో తాత్కాలికమేనని కేంద్రం బుధవారం రాజ్యసభకు తెలిపింది. జమ్ముకశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కుల కోసం నిర్దేశించిన ఆర్టికల్ 35ఏ కూడా భారత రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగంలో చేర్చబడిందని పేర్కొంది.

 ప్రస్తుతం ఆర్టికల్ 370 రాజ్యాంగంలో తాత్కాలికమైన ఉత్తర్వుగా (పార్ట్ XXI - తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేక నిబంధనలు) ఉన్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డితెలిపారు. ప్రస్తుతం, రాజ్యాంగం ఉత్తర్వులు (జమ్ము కశ్మీర్ కోసం), 1954లో ఆర్టికల్ 35ఏ ఉన్నది. ఆర్టికల్ 370 కింద దీన్ని చేర్చారు అని అన్నారు. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్గత భాగమని, రాజ్యాంగ విషయాలు అంతర్గతమని, పార్లమెంటు వాటిని చూసుకుంటుందని తెలిపారు. 

ఈ విషయంలో విదేశీ ప్రభుత్వాలు, సంస్థల ప్రమేయం ఉండదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టికల్ 370, 35ఏను ప్రభుత్వం ఉపసంహరించుకోనుందా? అని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.