నదీ జలాల వివాదాలకు ఒకే శాశ్వత ట్రిబ్యునల్

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సత్వర పరిష్కారానికి ప్రస్తుత 9 ట్రిబ్యునళ్లను విలీనం చేసి ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. కొత్త ట్రిబ్యునల్‌తోపాటు, అవసరమైన సమయాల్లో వివాదాలపై విచారణకు బెంచ్‌లను ఏర్పాటుచేసేలా అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం-1956లో సవరణలు చేయాలని ప్రతిపాదించింది. ట్రిబ్యునల్ మాదిరి కాక, ఈ బెంచ్‌లు వివాదాలు పరిష్కారమైన తర్వాత రద్దు కానున్నాయి. 

బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా నదీ జలాల విషయమై 9 ట్రిబ్యునళ్లు ఉన్నాయని, వివాదాల పరిష్కారానికి వీటికి 17-27 ఏండ్లు పడుతున్నది. రెండేండ్లలోతుది తీర్పు వెలువరించేలా కొత్త ట్రిబ్యునల్‌కు గడువు విధిస్తారు. ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించగానే ఆటోమేటిక్‌గా దాన్ని నోటిఫై చేసేలా ప్రతిపాదనలు పొందుపరిచినట్లు తెలుస్తున్నది. 

కాగా, 13 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి, ఒకే కోడ్‌గా మార్చడానికి రూపొందించిన బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, ఐటీ తదితర రంగాల్లో పది లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులున్న అన్ని సంస్థలకూ ఈ కోడ్ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వృత్తిపర భద్రత, ఆరోగ్యం, వర్కింగ్ కండీషన్స్ బిల్లు-2019 ద్వారా కార్మికులకు కవరేజీ పలు రకాలుగా మెరుగవుతుందని ప్రభుత్వం తెలిపింది. అనియంత్రిత డిపాజిట్ పథకాలపై నిషేధ బిల్లును క్యాబినెట్ ఆమోదించింది.