చంద్రబాబు పాలనలో ఏపీ అస్తవ్యస్తం...పరిపాలనే సాగలేదు

2014-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ అస్తవ్యస్థమైందని, ప్రజలు అనుకున్నట్టు పరిపాలన సాగలేదని, ఏ రంగంలోనూ పురోగమనం చూడలేదని ఆర్ధిక మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దుయ్యబట్టారు.   ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తూ  ‘‘2004- 2009లో మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ అన్ని రకాలుగా వృద్ధి చెందింది. ఆ కాలంలో 12శాతం వృద్ధి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు 2014-2019 ఎంతో కష్టకాలం. మనం వద్దనుకున్నా విభజన జరిగింది. పాలన కూడా ప్రజలు అనుకున్నట్టుగా జరగలేదు" అని తెలిపారు. 

 గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయరంగంలో అద్భుత ఫలితాలు వచ్చాయని చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ప్రచారం పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. ఫిషరీస్‌లాంటి కొన్ని అనుబంధ రంగాల్లోనే పురోగతి వచ్చిందని, అనుబంధరంగాలను వ్యవసాయంతో కలిపి చూపి.. ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్లలో వ్యవసాయరంగం అభివృద్ధి చెందకపోగా మైనస్‌లలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు.   

‘వ్యవసాయరంగంలో 1999- 2004 మధ్య కాలంలో 3.66 శాతం వృద్ధిరేటు ఉంది. 2004- 2009 మధ్య ఐదేళ్ల కాలంలో 6.14 శాతం నమోదైంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగ స్థూల ఉత్పత్తి తగ్గింది. చేపల, గొర్రెల పెంపకాల్లో వృద్ధిరేటు పెరిగిందనీ.. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించామంటూ అంచనాలు తయారు చేశారు. చేపల పెంపకం పెరిగినంతమాత్రాన వ్యవసాయ వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది’ అని బుగ్గన ప్రశ్నించారు.  

దేశ సగటుతో పోలిస్తే ఏపీ స్థూల ఉత్పత్తి తక్కువే.2004-09 మధ్య స్థూల ఉత్పత్తి బాగా పెరిగింది. 2014-2019 మధ్య వృద్ధి రేటు 11శాతమని లెక్కలు చెబుతున్నాయి.ఆ గణాంకాలు ఎంతవరకు నిజమో చూడాలని సూచించారు.   ద్రవ్యోల్బణం జాతీయ స్థాయిలో బాగా తగ్గినా ఏపీలో మాత్రం పెరిగింది.

 ప్రజలందరినీ భయపెట్టిన అంశం అప్పులే అంటూ  గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా రుణాలు తీసుకున్నారని,  ప్రస్తుతం ఆ అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంపై రూ 3.63 లక్షల కోట్ల అప్పు భారం మోపారని చెప్పారు. 

2014-17 మధ్య రాష్ట్రంలో 5 శాతం వృద్ధిరేటు మాత్రమే నమోదైంది. ద్రవ్యోల్బణం జాతీయస్థాయిలో తగ్గింది. కానీ, ఏపీలో మాత్రం వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర జీడీపీలో 3 శాతం దాటి అప్పులు చేయకూడదు. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ పరిమితిని దాటి అప్పులు చేసిందని ఆర్ధిక మంత్రి తెలిపారు. 

మౌలిక రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు. రాష్ట్ర రెవెన్యూ లోటు  రూ 66 వేల కోకు పెరిగింది. తెలంగాణకు వచ్చినంతగా మనకు పన్ను ఆదాయం రావడం లేదని బుగ్గన చెప్పారు.  గత ఐదేళ్లలో మౌలిక రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు.  2018-19 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.15వేల కోట్లు దాటింది. తలసరి ఆదాయం చూస్తే తెలంగాణ కంటే బాగా వెనుకబడి ఉన్నామని తెలిపారు. 

ఇన్ని ఆర్థిక కష్టాలు ఉన్నాయనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ అంశాన్ని నీరు గార్చి ప్రత్యేక ప్యాకేజీ వినూత్నమైనదంటూ  టిడిపి  ప్రభుత్వం సంతోషంగా తీసుకుందని బుగ్గన ధ్వజమెత్తారు. ఆ ప్యాకేజీలో ఉన్నదంతా పునర్విభజన చట్టంలోని హామీలే. చట్టపరంగా మనకు వచ్చే హక్కులనే రీప్యాకేజ్‌ చేసి పేపర్‌లో పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్యాకేజీనైనా సాధించారా అంటే అదీ లేదు. తొలి ఏడాదే లోటు బడ్జెట్‌ నిధులను కేంద్రం నుంచి తేలేకపోయారు. ఘోరమైన పరిస్థితుల్లో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మాకు అప్పగించిందని విమర్శించారు.  

‘‘రాష్ట్రంలోని అన్ని శాఖల్లోనూ పెద్ద ఎత్తున నిధుల చెల్లింపులను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం పెండింగ్‌లో లేకుండా చెల్లించింది. ఆర్నెల్ల క్రితం నాటి మధ్యాహ్న భోజన పథకం బిల్లులతో పాటు హొంగార్డులు, అంగన్‌వాడీల జీతాలను సైతం పెండింగ్‌లో ఉంచింది’’ అని బుగ్గన వివరించారు.