కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై కొనసాగుతున్న అనిశ్చిత

వారాంతపు సెలవు తర్వాత మంగళవారం విధులకు హాజరైన స్పీకర్ రమేశ్‌కుమార్  ఎమ్యెల్యేల రాజీనామాలపై వెంటనే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా సంక్షోభంలో చిక్కుకున్న కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట కలిగించారు. అసెంబ్లీకి రాజీనామా చేస్తూ 14 మంది ఎమ్మెల్యేలు పంపిన లేఖల్లో తొమ్మిది నిర్దేశిత ప్రమాణాల ప్రకారం లేవని స్పీకర్ చెప్పారు. వారిని మరోమారు సక్రమమైన పద్ధతిలో రాజీనామా లేఖలు పంపాలని కోరినట్టు తెలిపారు. 

తాజాగా మరో ఎమ్మెల్యే (కాంగ్రెస్ సభ్యుడు రోషన్ బేగ్) రాజీనామా చేశారని స్పీకర్ చెప్పారు. ఐదుగురు ఎమ్మెల్యేలే నిర్దేశిత ప్రమాణాల ప్రకారం రాజీనామాలు సమర్పించారని తెలిపారు. రాజీనామాలు చేసిన వారిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలున్నారు. తానేం చేసినా అది చరిత్రగా మిగిలిపోతుందని, అందువల్ల పొరపాట్లు చేయలేనని స్పీకర్ చెప్పారు.

రాజీనామాలు సక్రమంగా ఉన్న ఆ ఐదుగురు ఎమ్మెల్యేలూ తనను వ్యక్తిగతంగా కలుసుకోవాలని చెప్పారు. వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలను ఈ నెల 12న, ఇద్దరిని 15న రావాలని ఆదేశించారు. వారి వాదన విన్న తరువాత విచారణకు ఒక తేదీని నిర్ణయించి, సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తనను కలిసి తమ రాజీనామాలను అందజేయాలని రమేశ్‌కుమార్ చెప్పారు. 

అన్నీ పోస్టల్ పద్ధతుల్లో జరిగితే ఇక నేనెందుకు? నా అవసరమే ఉండదు కదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై తాను కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఈ విషయంలో నేను రాజ్యాంగం, చట్టం ప్రకారం నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు. నేను రెబల్స్ (ఎమ్మెల్యేలు)తో మాట్లాడలేదు. వారు నా బంధువులు కాదు. రాష్ట్రం వదిలి వెళ్లే ముందు వారు నాకు చెప్పలేదు అని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. 

తాను తీసుకునే నిర్ణయానికి తన రాజకీయ అనుబంధం అడ్డంకి కాబోదని స్పీకర్ రమేశ్‌కుమార్ చెప్పారు. స్పీకర్ చాంబర్‌లోకి ప్రవేశించిన తరువాత నేను కాంగ్రెస్ సభ్యుడిని కాదు. నేను న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను. కేవలం నా ప్రజలు, నా బాబా తప్ప ఎవరూ నాపై ఒత్తిడి తేలేరని స్పష్టం చేశారు.  

అయితే, తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించకున్నా, తమపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరినా.. మహారాష్ట్రలో మకాం వేసిన కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు ఏ మాత్రం బెదిరినట్టు కనిపించలేదు. తాము రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్నారు. తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర చెప్పారు.